నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి విషయంలో మరోసారి నిరాశే ఎదురైనట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రోజాకు ఈసారి కూడా సీఎం జగన్ కేబినెట్‌లో చోటుదక్కలేదని సమాచారం. 

నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి విషయంలో మరోసారి నిరాశే ఎదురైనట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రోజాకు ఈసారి కూడా సీఎం జగన్ కేబినెట్‌లో చోటుదక్కలేదని సమాచారం. దీంతో ఆమె అభిమానులు, అనుచరులకు నిరాశే మిగిలింది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో కేబినెట్ బెర్త్‌పై ఎమ్మెల్యే రోజా ఆశలు పెట్టుకున్నా సంగతి తెలిసిందే. మరోవైపు రోజాకు ఈసారి కేబినెట్ బెర్త్ గ్యారంటీ అనే ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా రోజా వరుసగా పలు ఆలయాలకు వెళుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఆమె జబర్దస్త్ షో జడ్జిగా తప్పుకుంటున్నారనే ప్రచారం జరిగింది. దీంతో రోజాకు కేబినెట్ బెర్త్ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. 

రోజాకు మంత్రివర్గంలో చోటుదక్కడంతోనే మొక్కులు తీర్చుకుంటుందని కొందరు.. మంత్రి పదవి దక్కాలని పూజలు చేస్తున్నారని మరికొందరు చెప్పుకొచ్చారు. దీంతో రోజాకు మంత్రి వర్గంలో చోటుదక్కుతుందా..? లేదా..? అనేది మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. మంత్రి వర్గంలో రోజాకు చోటు లభించలేదని తెలుస్తోంది. దీంతో రోజా.. హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. రేపు జరిగే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆమె హాజరయ్యే అవకాశం లేదని సమాచారం. 

ఫైర్ బ్రాండ్‌గా తనదైన ముద్ర.. 
వైసీపీలో రోజా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ జగన్‌పై ఎవరు విమర్శించినా.. రోజా తనదైన శైలిలో వారికి కౌంటర్ ఇచ్చేవారు. నగిరి నియోజవర్గం నుంచి వైసీపీ తరఫున 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన రోజా.. విజయం సాధించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసేవారు.

2019లో సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రోజాకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆమెకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. అయితే జగన్ ఆమెను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఆ పదవీ కాలం ముగిసినప్పటికీ.. మళ్లీ పొడగించలేదు. దీంతో ఆమెకు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయనే ఆమె అభిమానులు భావించారు. 

అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి రాజకీయ సమీకరణాల వల్లే రోజాకు మంత్రిపదవి దూరమైనట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత.. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి మంత్రులుగా తీసుకున్నారు. అయితే అప్పుడు చెప్పినట్టుగానే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. మంత్రుల చేత రాజీనామా చేయించారు. 

దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కేబినెట్ రేస్‌లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అనుభవం, సామాజిక సమీకరణాలు, జిల్లాల అవసరాల దృష్ట్యా కొనసాగించే పాత మంత్రుల్లో 10 మందిని కొనసాగించాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే సీనియర్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డికి మళ్లీ మంత్రిగా కొనసాగించనున్నారని సమాచారం. 

అయితే పెద్దిరెడ్డి రెండో దఫా మంత్రిగా కొనసాగుతుండటంతో.. ఉమ్మడి జిల్లాలో అదే సామాజికవర్గానికి చెందిన రోజా, భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదని తెలుస్తోంది. మరోవైపు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనకు మంత్రి వద్దని చెప్పడంతో.. ఆయనకు తుడా ఛైర్మన్‌ పదవీ కాలాన్ని పొడగించారు. ఇక, జగన్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి దక్కుతుందనే ఆశలు పెట్టుకున్న రోజాకు.. రెండు సార్లు (తొలుత ఒకసారి, ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణలో మరోసారి) నిరాశే మిగిలిందని అంతా అనుకుంటున్నారు.