ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఇప్పటికే రాజధాని విషయంలో ఏమి తేలుస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేతలు ఒకరిపై మరొకరు మరింత హీటు పెంచేలా కామెంట్స్ చేసుకుంటున్నారు. సోమవారం ఉధయం అమరాతిలో మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే రోజా... చంద్రబాబు పై తీవ్ర విమర్శలు  చేశారు.

చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విపక్షనేతగా వ్యవహరించడంలేదని.. కేవలం 29గ్రామాలకు మాత్రమే విపక్ష నేతగా వ్యవహరిస్తున్నారని రోజా విమర్శించారు. కూకట్ పల్లి నుంచి మహిళలను తీసుకువచ్చి ఇక్కడ నిరసనలు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. తల్లి ఏవిధంగా తన బిడ్డలను సమానంగా చూస్తుందో... సీఎం జగన్ కూడా మూడు రాజధానులకు సమన్యాయం చేస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read ఇది బ్లాక్ డే, అమరావతిని నిలుపుకొంటాం: చంద్రబాబు కామెంట్స్...

పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ... చంద్రబాబు ఎందుకు ఇక్కడికి పారిపోయి వచ్చారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాస్వతమైన భవమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. అనుభవం లేని నారాయణ అధ్యక్షతన కమిటీ ఎలా వేశారని అడిగారు. అసెంబ్లీలో 151మంది ఎమ్మెల్యేలకు రెండు బాత్రూమ్ లేనా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఎన్నో ప్రలోభాలు పెట్టినా.. తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టినట్టుగా ప్రజలు ఓడించారని రోజా పేర్కొన్నారు.40 ఏళ్ల కుర్రాడు జగన్ వేసిన దెబ్బకు.. చంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు ఏనాడైనా జోలె పట్టారా? అని రోజా ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు మహిళలు ఎన్నో బాధలు పడినప్పుడు.. ఈ మహిళలు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆడదానికి రక్షణ కల్పించలేదని రోజా విమర్శించారు.