Asianet News TeluguAsianet News Telugu

ఆసక్తిగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీ మాక్ పోలింగ్, వారిపైనే టీడీపీ ఆశలు.. ఎవరి లెక్కలు వారివే!

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొత్తం 7 స్థానాలకు ఈ నెల 23న ఎన్నిక జరగనుంది. అధికార వైసీపీ ఏడుగురు అభ్యర్థులను నిలుపగా.. టీడీపీ ఒక అభ్యర్థిని ప్రకటించింది.

MLA quota mlc elections TDP and YSRCP issue whips to their the members here is the both parties plans ksm
Author
First Published Mar 21, 2023, 10:04 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొత్తం 7 స్థానాలకు ఈ నెల 23న ఎన్నిక జరగనుంది. అధికార వైసీపీ ఏడుగురు అభ్యర్థులను నిలుపగా.. టీడీపీ ఒక అభ్యర్థిని ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను 151 మంది ఎమ్మెల్యేల బలంతో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుందని భావించింది. అయితే ప్రతిపక్ష టీడీపీ రంగంలోకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే వైసీపీ 6 స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ.. మిగిలిన ఒక్క స్థానంలో విజయం ఎవరిదనే దానిపై విస్తృతమైన చర్చ సాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, వైసీపీ పార్టీలు వారి వారి పార్టీ సభ్యులకు విప్‌లు జారీ చేశాయి.

అసెంబ్లీలో బలం ప్రకారం.. వైఎస్సార్‌సీపీకి 151 మంది ప్రజాప్రతినిధులు, టీడీపీకి 23 మంది, జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కానీ రహస్య బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరగనుందన్న.. వాస్తవ సంఖ్యలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నలుగురు ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా ఉన్నారు. అలాగే జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీకి విధేయతతో ఉన్నారు. దీంతో టీడీపీ బలం 19కే పరిమితమైంది. అయితే ప్రస్తుతం వైసీపీ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు(ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి) ఉన్నారు. వారు ప్రస్తుతం వైసీపీకి ఓటు వేసే పరిస్థితి లేదని ప్రచారం సాగుతుంది. దీంతో ఇరు పార్టీలకు ప్రతి ఎమ్మెల్యే ఓటు కీలకం కానుంది. 

టీడీపీ ఆశలు వారిపైనే.. 
ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపొందాలంటే 22 నుంచి 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు రావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే టీడీపీకి సాంకేతికంగా 23 మంది సభ్యులు ఉన్నా.. అందులో పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నలుగురు ఏటువైపు ఓటు వేస్తారనేది చెప్పలేని పరిస్థితి. వైసీపీకి మద్దతుగా ఉన్న ఆ నలుగురు ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతారనే విశ్లేషణలు ఉన్నాయి.  అయితే వాస్తవానికి 19 మంది సభ్యుల బలం ఉన్న టీడీపీ.. మిగిలిన మూడు నాలుగు ఓట్లు సంపాదించుకుని విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. 

టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓట్లు వేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి విప్ జారీ చేశారు. అయితే టీడీపీ నుంచి విజయం సాధించి వైసీపీకి మద్దతు తెలిపిన.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌లు.. ఇప్పుడు పార్టీ విప్‌కు కట్టుబడతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డితో పాటు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్న మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయవచ్చని టీడీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అధికార వైసీపీ జాగ్రత్తలు..
అసెంబ్లీలో మెజారిటీని కలిగిన ఉన్న అధికార వైసీపీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను అన్నింటిని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమితో.. ఈ ఎన్నికపై వైసీపీ అధిష్టానం మరింత ఫోకస్ పెట్టింది. ఓటింగ్‌లో ఎటువంటి తప్పిదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. వైసీపీకి సొంతంగా  151 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. జనసేన ఒక ఎమ్మెల్యే, టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో ఆ పార్టీ మొత్తం బలం 156గా ఉంది. అయితే అందులో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేను తీసేసిన ఆ పార్టీకి 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టుగా అవుతుంది. మరోవైపు ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేసినా ఆ పార్టీ అభ్యర్థికి 21 ఓట్లు పోలయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈ లెక్కను పరిగణలోకి తీసుకుంటే.. వైసీపీ ఏడు స్థానాలకు గెలుచుకోవాలంటే ప్రస్తుతం ఉన్న ఓట్లలో ఒక్క ఓటు కూడా నష్టపోకూడదు. ఎందుకంటే.. ఏడుగురు అభ్యర్థులు విజయం సాధించాలంటే.. 154 మంది సభ్యులు.. 22 మంది చొప్పున ఏడు గ్రూప్‌లుగా ఏర్పడి వారికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏడు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే తమ సభ్యులకు మాక్‌పోల్‌ నిర్వహించింది. వైసీపీ తమ ఎమ్మెల్యేలను ఏడు గ్రూపులుగా విభజించింది. ఒక్కో గ్రూపులో 22 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో గ్రూపు నుంచి ముగ్గురు కీలక వ్యక్తులకు తమ గ్రూపులోని మిగిలిన సభ్యులతో సమన్వయం చేసుకునే బాధ్యతను అప్పగించింది. ప్రణాళికాబద్ధంగా తమ ప్రతి ఎమ్మెల్సీ అభ్యర్థికి 22 ఓట్లు వేయగలిగితే ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైసీపీ సునాయాసంగా గెలుస్తుందనే లెక్కలు ఉన్నాయి. అయితే అధికార పార్టీ సభ్యులు మొదటి ప్రాధాన్యత ఓటు వేయడంలో చిన్న చిన్న పొరపాట్లు  జరిగినా ఆ పార్టీకి సమస్య తలెత్తే అవకాశాలు లేకపోలేదు. 

అభ్యర్థులు, పోలింగ్‌కు సంబంధించిన వివరాలు.. 
మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి.. వైసీపీ నుంచి పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మ‌ర్రి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ పోటీ చేస్తున్నారు. మార్చి 23న అసెంబ్లీలోని మొదటి అంతస్తులోని కమిటీ హాల్‌లో పోలింగ్ నిర్వహించనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios