2019 ఎన్నికలకు ముందు కూడా ఇదే తరహాలో గోడ గడియారాలను పంపిణీ చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల తయారీ కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల టైం ఉండగానే ముందు జాగ్రత్త పడుతున్నారు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు. దీనికి సంబంధించిన ఓ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వెలుగు చూసింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కొడుకు మోహిత్ రెడ్డి ఫోటోలు ఉన్న గోడగడియారాలను జనాలకు పంపిణీ చేస్తున్నారు. మోహిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీలో నిలబడబోతున్నారు.
దీంతో ఇప్పటినుంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ దీనిమీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా చేయడం ఇదేమి మొదటిసారి కాదని 2019 ఎన్నికలకు ముందు కూడా ఇదే తరహాలో గోడ గడియారాలను పంపిణీ చేశారని చెబుతున్నారు. ఆ సమయంలో పంపిణీ చేసిన గడియారాలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటో ఉండగా.. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న గడియారాలపై మోహిత్ రెడ్డి ఫోటో ఉంది. ఈ ఘటన గురువారం నాడు వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 15 వ తేదీకి వాయిదా
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదినం గురువారం. తన పుట్టినరోజును పురస్కరించుకొని పంపిణీ చేసిన గడియారాళ్లపై తన కొడుకు మోహిత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. దీంతో ఇది ఎన్నికల తాయిలమే అని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఆ గడియారాలపై మోహిత్ రెడ్డి ఫోటోతో పాటు.. ‘మీరు, మీ మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా.. ఆనందంగా.. ఆర్థికంగా.. బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను..’ ఇట్లు మీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, చంద్రగిరి అని ముద్రించారు. ఈ గడియారాలను దాదాపుగా 1.15 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
గడియారాలను పంపిణీ చేయడం కోసం ఇప్పటికే పలు మండలాలలోని ఆయా గ్రామాల్లోని వైసీపీ శ్రేణులకు ఈ గడియారాలను చేర్చినట్లు తెలుస్తోంది. అక్కడున్న వైసీపీ శ్రేణుల, వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందితో వీటిని పంపిణీ చేయిస్తున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
