ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 15 వ తేదీకి వాయిదా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత నెలలో మధ్యంతర బెయిల్ ను ఇచ్చింది. ఆరోగ్య కారణాలతో చంద్రబాబునాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు రాజమండ్రి జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.
అయితే ఈ పిటిషన్ పై విచారణను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపున ప్రత్యేక పీపీ వివేకానంద హైకోర్టును అభ్యర్థించారు.దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై వాదనలు విన్పించాల్సిన ఏఏజీ సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరు కాలేకపోతున్నందున విచారణను వాయిదా వేయాలని కోరారు.
ఈ నెల 22వ తేదీ వరకు విచారణను వాయిదా వేయాలని సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద కోరారు. అయితే ఈ వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.ఈ నెల 15వ తేదీకి విచారణను వాయిదా వేసింది.మరోసారి సమయం కోరవద్దని కూడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఐడీ తరపు న్యాయవాదికి సూచించింది.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిందితులుగా పేర్కొన్న వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
also read:ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంలో స్వల్ప ఊరట: స్కిల్ కేసుపై దీపావళి తర్వాత తీర్పు
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు పూర్తి చేసింది. దీపావళి తర్వాత ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది.మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నెల 30న విచారణ నిర్వహించనుంది.