వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని  ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఓట్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్లను తొలగించాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రశాంత్ కిశోర్ చేత వైసీపీ.. ఏపీలో సర్వే చేయించిందని ఆయన తెలిపారు.

ప్రశాంత్ కిశోర్ సర్వేలో కూడా టీడీపీనే గెలుస్తుందని.. వైసీపీకి 25సీట్లు కూడా రావని తేలిందని ఆయన అన్నారు. అందుకే వైసీపీ నేతలు ఓట్లను తొలగించే పనిలో పడ్డారని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కూడా వైసీపీ రాజకీయ రాద్దాంతం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.