మంత్రివర్గంలో మరోసారి చోటుదక్కక పోవడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
మంత్రివర్గంలో మరోసారి చోటుదక్కక పోవడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవికి దక్కకపోవడంతో నిరసనగా రాజీనామా చేయాలని బాలినేని భావిస్తున్నట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక, సోమవారం బాలినేని నివాసంలోనే ప్రకాశం జిల్లా ముఖ్య నేతలు సమావేశమయ్యారు. వారితో తన భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో బాలినేని మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ రెడ్డి కూడా బాలినేనిని కలిశారు.
తనకు తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో బాలినేని నిరాశ చెందారు. తమ జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌ను తిరిగి కేబినెట్‌లో చోటు కల్పించి.. తనను తొలగించడంతో ఆయన మరింత అసంతృప్తికి గురయ్యారు. బాలినేనికి కేబినెట్‌లో బెర్త్ దక్కకపోవడంతో ఆయన సొంత నియోజవర్గంలో అనుచరులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆయనను బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం రెండు సార్లు ఆయన నివాసానికి వచ్చారు. తొలుత మధ్యాహ్నం ఆయన ఇంటికి వచ్చిన చర్చలు జరిపిన సజ్జల.. మంత్రివర్గ జాబితా విడుదల తర్వాత రాత్రి మరోసారి ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడారు. అయితే రాత్రి బాలినేనితో చర్చించిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
ఇక, బాలినేని మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో.. నిరసనగా సంతమాగులూరు మండల పరిషత్ అధ్యక్ష పదవికి వెంకటరెడ్డి రాజీనామా చేశారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి కొటారి రామచంద్రరావు రాజీనామా చేశారు. ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
