చిరంజీవికి అంతకన్నా ఎక్కువే, పవన్ కల్యాణ్ భ్రమ: అనిత

చిరంజీవికి అంతకన్నా ఎక్కువే, పవన్ కల్యాణ్ భ్రమ: అనిత

విశాఖపట్నం: తమపై తీవ్ర విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు వంగలపూడి అనిత ఎదురు దాడికి దిగారు.  పవన్ కల్యాణ్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. పిహెచ్ సికి, సిహెచ్ సీకి మధ్య తేడా కూడా పవన్ కల్యాణ్ కు తెలియదని ఆమె అన్నారు. 

శుక్రవారం పాయకరావుపేటలో జరిగిన బహిరంగసభలో అవగాహనా రాహిత్యంతోనే పవన్ కల్యాణ్ తమపై తమపై ఆరోపణలు చేశారని అన్నారు. ఒక పీహెచ్‌సీ వున్న ప్రాంతానికి, ఐదు కిలోమీటర్లలోపు మరో ఆస్పత్రి వుంటే విస్తరణ కుదరదని చెప్పారు.
 
పాయకరావుపేటలో పీహెచ్‌సీ వుండగా, కేవలం కిలోమీటరు దూరంలో గల తునిలో 100 పడకల ఆస్పత్రి వుందని, శ్రీరాంపురంలో కూడా పీహెచ్‌సీ వుందని, ఈ విషయాన్ని పవన్‌ తెలుసుకోవాలని ఆమె అన్నారు. 

నక్కపల్లిలో వున్న సీహెచ్‌సీని 30 పడకల నుంచి 50 పడకలుగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని చెప్పారు. 

ఇసుక తవ్వకాలను తాను ప్రోత్సహించబోనని, కఠిన చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని, తాండవ నది ఆక్రమణలు ఎవరి హయాంలో జరిగిందో తెలుసుకోవాలని ఆమె అన్నారు. పాయకరావుపేటలో జూనియర్‌ కళాశాల వునప్పటికీ లేదనడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాల్లో చదువుతున్నారనేది అర్థమవుతోందని అన్నారు.
 
పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే విషయం తెలియక 2019లో జనసేన ఖాతాలో చేరుతుందని పవన్ కల్యాణ్ అనడం హాస్యాస్పదమని అనిత అన్నారు. తన సభలకు వచ్చిన జనాలను చూసి, అవే ఓట్లనుకునే భ్రమలో పవన్‌ వున్నారని, ఆయన సోదరుడు చిరంజీవి సభలకు అంతకంటే ఎక్కువ జనం హాజరయ్యేవారని అన్నారు.

పవన్ కళ్యాణ్ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని టీడీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలను 15 రోజుల్లో రుజువు చేయాలని డిమాండ్ చేశారు.

 తనకు పవన్‌ క్షమాపణ చెప్పాలని, లేకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమని, అలాగని లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. పవన్ కల్యాణ్ లాగే తమకు కడా తిక్కుందని...దానికో లెక్కుందని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పకపోతే ఆ లెక్కేంటో చెబుతామని పంచకర్ల  అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page