నేడు దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు సంబరంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ వేడుకలు నిర్వహించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. జెండాను ఆవిష్కరించారు. కాగా ఈ వేడుకలను ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. అయితే.. ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.

సీఎం జగన్ వచ్చిన తరువాత ఆయన పోడియంను అనుకొని ఉన్న మీడియా గ్యాలరీ(ఏ ఏ)లో ఏర్పాటు చేసిన ఏసీ నుండి పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఏసీకి పవర్ సప్లైను కట్ చేశారు.

అంతకుముందు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆడియో స్పీకర్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆడియో స్పీకర్ నుండి పొగలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సెక్యురిటి సిబ్బంది పరిస్థితిని సమీక్షించి సరిదిద్దారు. 

అనంతరం వేడుకలు ఎలాంటి అవాంతరం లేకుండా జరిగిపోయాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేశారు.  అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.

జెండాను ఆవిష్కరించే ముందు ట్విట్టర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "నేడు మనం ఆనందిస్తున్న స్వేచ్ఛను మనకు ప్రసాదంగా ఇచ్చిన వీరులకు నా వందనాలు. దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించినవారికి వందనం. మన దేశం విలువలను కాపాడుకుంటామని, దేశ ప్రతిష్టను రక్షిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం దేశ పురోగతికి కంకణబద్ధులమవుదాము" అని అన్నారు