ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ మీద సామూహిక అత్యాచారం జరిగింది. దీనికి నష్టపరిహారంగా గ్రామపంచాయతీ రూ.లక్ష ఇప్పించేందుకు నిందితులను ఒప్పించారు.
కోనసీమ జిల్లా : ఆంధ్ర ప్రదేశ్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని సముద్రతీర గ్రామం చిర్రయానాంలో ఓ మైనర్ బాలికపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారిలో అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచి ఓలేటి మంగాదేవి, వైసిపి నాయకుడు నాగేశ్వరరావుల కొడుకు తేజ కూడా నిందితుడిగా ఉన్నాడు. అతనితో పాటు మరో నలుగురు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన జరిగి పది రోజులు అవుతుంది. ఘటన జరిగిన తర్వాత పది రోజులకుగాని ఇది వెలుగులోకి రాలేదు. దీనికి కారణం బాధిత కుటుంబాన్ని రకరకాలుగా బెదిరించడమే. అధికార పార్టీ అండ ఉందన్న సాకు.. గ్రామకట్టుబాట్లు అనే ముసుగులో బాధిత కుటుంబాన్ని భయపెట్టినట్టు తెలుస్తోంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 6వ తేదీన బాధిత బాలిక ఇసుకతిన్నెల్లోని చెలమల్లో మంచినీరు తెచ్చుకునేందుకు వెళ్ళింది.
అయితే, అప్పటికే అక్కడ ఉన్న ఐదుగురు యువకులు ఆ బాలికను చూశారు. ఆమెను సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్ళారు. అక్కడ ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. నీళ్లకని వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి వచ్చిన తీరు అనుమానాస్పదంగా ఉండడంతో కుటుంబసభ్యులు ఆమెను నిలదీశారు. దీంతో తన మీద జరిగిన అఘాయిత్యాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. బోరున విలపించింది.
దీంతో బాలిక తండ్రి ఈ ఘటనకు మీద పోలీసులకు ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించాడు. విషయం తెలిసిన అధికార పార్టీ నాయకులు అతడిని ఫిర్యాదు చేయకుండా, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాకాకుండా గ్రామంలో పంచాయతీ నిర్వహించి.. బాధిత కుటుంబానికి లక్షరూపాయల నష్టపరిహారం ఇచ్చేలా నిర్ణయించారు. అయితే, ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పది రోజుల తర్వాత బయటకి పొక్కింది. దీంతో ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి దీనిపై విచారణ జరపాలని అమలాపురం డిఎస్పి మాధవరెడ్డి, ముమ్మిడివరం సిఐ జానకిరామ్ లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీరు గ్రామానికి చేరుకుని అక్కడ సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు.
ఈ విచారణలో బాధితురాలి తండ్రి పోలీసులకు నిందితుల మీద ఫిర్యాదు చేశారు. ఓలేటి తేజ, ఓలేటి తులసిరావు, ఓలేటి ధర్మరాజు, మల్లాడి వంశీ, అర్ధాని వీరబాబులను నిందితులుగా గుర్తించి వీరిమీద కాట్రేనికోన పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాధ్యత బాలికను ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు సూర్యకుమారి బాలికను పరీక్షించారు. ఈ దారుణమైన ఘటన మీద రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. జిల్లా ఎస్పీతో ఈ మేరకు శుక్రవారం ఫోన్లో సంభాషించారు. ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
