వైసీపీ, బీజేపీ నేతలపై  ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసింది వైసీపీ నే అని ఆయన ఆరోపించారు. ఏపీ అప్పులపై వైసీపీ, బీజేపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రానికి నిధులు అందకూడదనే దుర్భుద్దితో వైసీపీనే కేంద్రానికి తమపై తప్పుడు ఫిర్యాదులు పంపిందని.. తద్వారా నిధులు ఆగిపోయానని ఆయన అన్నారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కై.. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకి ఇష్టం లేదన్నారు.

అన్నివిధాలా ఏపీ అగ్రగామిగా నిలవడం చూసి బీజేపీ, వైసీపీ తట్టుకోలేకపోతున్నాయన్నారు.  విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఏపీకి రూ.22,761 కోట్లు రావాల్సి ఉందని  యనమల తెలిపారు.