విజయవాడ: తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం మనస్తత్వం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుదని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కన్నతల్లి లాంటి పార్టీని, ఆయనను గెలిపించిన జగన్ మోహన్ రెడ్డిగారిని విమర్శిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

జగన్ కాళ్లు పట్టుకొని టిక్కెట్టు తెచ్చుకొన్న రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఆయననే విమర్శిస్తున్నాడన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు.శుక్రవారం నాడు మంత్రి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. 

నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణ రాజు ఢిల్లీలో చెట్టు కింద కూర్చుని రోజూ పనీపాటాలేని వార్తలు చదువుతున్నారన్నారు. ఎల్లో పేపర్లలో వచ్చే వార్తలు చదవాలంటే.. వాటిపై ఆయన విశ్లేషణలు చేయాలనుకుంటే.. చెట్టు కింద ఎందుకు..? ఆ టీవీ ఛానళ్ళలోనే ఉద్యోగంలో చేరితే చాలునని చెప్పారు. రఘురామకృష్ణరాజు.. తనకు తాను మేధావిగా డిక్లేర్ చేసుకుని.. సెల్ఫ్ ప్రమోటెడ్ ఇంటలెక్చువల్ మాదిరిగా.. నీతులు చెబుతున్నాడని ఆయన  చెప్పారు.

అసలు ఆయన నీతులు చెప్పే పరిస్థితిలో ఎంపీ  ఉన్నాడా..? అని ఆయన ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి.. ఆయన ఎవరికి భజన చేస్తున్నాడు..? ఎవరిని విమర్శిస్తున్నాడో చెప్పాలన్నారు. 

అందరికీ శకునాలు చెప్పే బల్లి.. కుడితిలో పడినట్టుగా .. రఘురామకృష్ణ రాజు వ్యవహారం ఉందని ఆయన తెలిపారు. పైకి చెప్పేది నీతులు... ఆయన చేస్తున్నది ఏమిటో చెప్పాలన్నారు.

వైయస్ కుటుంబానికి, జగన్ మోహన్ రెడ్డికి మతాన్ని అంటగట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలంటే అది మీ తరం కాదన్నారు. ఇలాంటి ఎన్నో డ్రామాలు గతంలో చంద్రబాబు నాయుడు చేశాడు.. వైఎస్ కుటుంబంపై ఎన్నో అపవాదులు వేశారు. చివరికి ఏమైందని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. 

వైయస్ కుటుంబం అంటే.. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరి మేలు, సమాజం మేలు కోసం పరితపించే  కుటుంబమని ఆయన గుర్తు చేశారు.నా కులం మానవత్వం.. నా మతం మాట తప్పకపోవడం అని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చెప్పిన మాటలను ఆయన ప్రస్తావించారు. కులాలు, మతాలు అడ్డుపెట్టుకుని నేటి ఆధునిక ప్రపంచంలో కూడా రాజకీయాలు చేయటం దురదృష్టకరమన్నారు మంత్రి.