విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు కర్నూలు రాజధాని కావాలని అడిగిన పవన్ కల్యాణ్ కర్నూలుకు హైకోర్టు వస్తే ఉద్యోగాలు వస్తాయా అని అంటున్నారని, ఇది పవన్ కల్యాణ్ అజ్ఞానానికి నిదర్శనమని ఆయన అన్నారు. 

కర్నూలు అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశంసించారు. శ్రీబాగ్ ఒడంబడికలో కర్నూలులో హైకోర్టు పెట్టాలని ఉందని ఆయన గుర్తు చేశారు. శనివారంనాడు విజయవాడలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. 

టీడీపీ అధినేత చంద్రబాబుతో లాలూచీ పడి పవన్ కల్యాణ్ బిజెపిలో చేరారని, పవన్ కల్యాణ్ చంద్రబాబు మేలు కోసమే పనిచేసే వ్యక్తి అని వెల్లంపల్లి అన్నారు. చంద్రబాబు వద్ద పవన్ కల్యాణ్ గుమస్తాగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోళ్ల నుంచి ఒకే మాట వస్తుదని, వాళ్ల భాగస్వామ్యంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఆయన అన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు దుర్మార్గంగా దోచుకున్నందు వల్లనే ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆయన అన్నారు. పైగా చంద్రబాబు పైగా పరిశ్రమలకు సబ్సిడీలు ఇవ్వలేదని ఆయన అన్నారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయన విమర్శించారు.