మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసులో మరో ట్విస్టు: నిందితుడు పరార్... అనుచరుడు ఆత్మహత్యాయత్నం
రాయచోటి పరిధిలోని చిన్నమండెం గ్రామంలో భూకేటాయింపులు సంబంధించి మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతుంది. అసలు సంతకం ఫోర్జరీ చేసినట్టుగా భావిస్తున్న రెడ్డప్ప అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉండగా... అతని అనుచరుడైన కిరణ్ తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
రాయచోటి: రాయచోటి పరిధిలోని చిన్నమండెం గ్రామంలో భూకేటాయింపులు సంబంధించి మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతుంది. అసలు సంతకం ఫోర్జరీ చేసినట్టుగా భావిస్తున్న రెడ్డప్ప అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉండగా... అతని అనుచరుడైన కిరణ్ తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
రెడ్డప్ప ఆచూకీ దొరకకపోవడంతో అతడికి సంబంధించిన వ్యక్తులనందరిని పోలీసు స్టేషన్ కి తీసుకొచ్చి పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రెడ్డప్ప అనుచరుడైన కిరణ్ ని సైతం పోలీసులు స్టేషన్ కి తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించారు.
బంధువులు, సన్నిహితులు వచ్చి అతడికి రెడ్డప్ప గురించి ఏమి తెలియదని చెప్పినప్పటికీ కూడా పోలీసులు వినలేదు. రాత్రంతా అతడిని స్టేషన్లోనే ఉంచారు. ఆ తరువాత అతడిని తెల్లారి తీసుకెళ్లి అతడి స్వగ్రామమైన దేవులంపల్లిలో విడిచిపెట్టివచ్చారు పోలీసులు.
పోలీసులు విడిచిపెట్టినతరువాత మనస్తాపానికి గురైన కిరణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కిరణ్ ని విడిచిపెట్టి వెళుతున్న పోలీసులు ఈ సమాచారాన్ని అందుకోవడంతో వారు వెనక్కి వచ్చి అతడిని అదే జీపులో తీసుకెళ్లి రాయచోటిలో ఆసుపత్రికి తరలించారు.
Also read: మంత్రి వనిత సంతకం ఫోర్జరీ.. అడ్డంగా బుక్కైన టీడీపీ నేత
విషయం తెలుసుకున్న అతని భార్య, బంధువులు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు పెట్టిన టార్చర్ ని తట్టుకోలేకనే తన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు అతని భార్య ఆరోపిస్తుంది. కిరణ్ పరిస్థితి ప్రస్తుతానికి విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
అసలు ఈ కేసు ఏమిటి...?
చిన్నమండెం మండలంలో రెడ్డప్ప కుటుంబం ఎప్పటినుండో టీడీపీలో కొనసాగుతోంది. ఒక ఎకరం పైచిలుకు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండడం చూసి తనకు చిన్నతరహా పరిశ్రమ ఏర్పాటుచేసుకునేందుకు ఆ భూమిని కేటాయించాలని, మంత్రి వనిత సిఫార్సు లేఖను జతచేసి రెవిన్యూ అధికారులకు ఇచ్చారు.
ఇదే భూమిని గ్రామసచివాలయం ఏర్పాటుకు కేటాయించాలని కొందరు వైసీపీ కార్యకర్తలు కూడా అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. స్వయంగా మంత్రి వనిత తన సంతకాన్ని ఫోర్జరీ చేసారని డీజీపీ గౌతమ్ సవాంగ్ కి ఫిర్యాదు చేసింది.
అప్పటినుండి నిందితుడు రెడ్డప్ప కనబడకుండా తిరుగుతున్నాడు. రెడ్డప్ప అజ్ఞాతంలో ఉండడంతో పోలీసులు ఎలాగైనా అతడిని పట్టుకు తీరాలని వెదుకులాటను ముమ్మరం చేసారు. ఇందులో భాగంగానే కిరణ్ ని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విచారించారు.