అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తానన్నది రాష్ట్రమా? కేంద్రమా? ఈ ప్రశ్నకు మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు.  విశాఖ ఉక్కుపై చంద్రబాబు ఒక్క మాట కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదు, ఎందుకు? అని నిలదీశారు. ప్రధాని మోదీ అంటే చంద్రబాబుకు భయమని... అందుకే కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబు చౌకబారు రాజకీయాలు ఆపాలని...ఉక్కు ప్యాక్టరీపై లేఖ రాయాల్సింది, అడగాల్సింది ప్రధానిని అని అన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ ఎందుకు రాయరు.. ఏమిటీ డ్రామా? అని మంత్రి నిలదీశారు. 

''సీఎం వైఎస్‌ జగన్ ఫోబియా చంద్రబాబుకు పట్టుకున్నట్లుంది.  నిద్రలేచినా, పడుకున్నా జగన్ నామస్మరణే. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా సీఎం ప్రకటిస్తే... బాబు, ఆయన మీడియా విషం చిమ్మిన సంగతి ఎవ్వరూ మర్చిపోలేదు. కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై వార్తలు వస్తున్నాయ్‌.. బాబు హయాంలోనూ బీజం పడింది. దక్షిణ కొరియా వెళ్ళి పోస్కో ప్రతినిధులను చంద్రబాబు కలిసింది వాస్తవం కాదా?ఉక్కుపై పోరాటం అంటూ.. జాతి మీడియాలో హెడ్డింగ్‌ల కోసమే బాబు ఆరాటం'' అని ఆరోపించారు. 

''విశాఖలో పరామర్శకు వచ్చిన చంద్రబాబు చాలా ఆవేశపూరితంగా మాట్లాడారు. పంచ్‌ డైలాగులు, చేతులు ఊపుతూ ప్రజలను రెచ్చగొట్టేలా బాబు మాట్లాడారు. ఆయన్ను ఏదో ఆవహించినట్లుగా, పూనకం వచ్చినట్లుగా వ్యవహరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపాలన్నదే అందరి లక్ష్యం. విశాఖ స్టీల్ ఉద్యోగులు, వివిధ ప్రజాసంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. సామాన్య ప్రజలు సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మంచిది కాదంటున్నారు. రాజకీయాల్లో తాను అందరికంటే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు మరి, ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా తోకముడుస్తారా..? సీఎం జగన్ గారిని తిట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రసంగం సాగింది. విశాఖపట్నంకు చంద్రబాబు వచ్చిన విషయంపై కాకుండా ఏదో మాట్లాడటం ఏంటి?'' అని నిలదీశారు. 

''రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద పరిశ్రమల్లో విశాఖ ఉక్కు ఒకటి. వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధిని ఇస్తోంది. ఈ ఉక్కు పరిశ్రమ మీద 2 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. ఆ సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమబాట పట్టారు. మరి చంద్రబాబు ఒక్కమాట కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదు. మోడీ అంటే చంద్రబాబుకు భయం. అందుకే కేంద్రాన్ని ప్రశ్నించలేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వమా? కేంద్ర ప్రభుత్వమా అనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రైవేటీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే అప్పుడు విమర్శలు చేయొచ్చు. కానీ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు. అందరికీ చంద్రబాబు ఉత్తరాలు రాస్తారు, కానీ ప్రధాని మోడీకి ఎందుకు లేఖలు రాయరు. భయమా? లేక ఏమిటీ డ్రామా?'' అని ప్రశ్నించారు. 

read more   తీవ్రతరమవుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం: రేపు విశాఖకు సీఎం జగన్

''పోస్కో ప్రతినిధులు జగన్ గారిని కలిశారట. సీఎంతో చీకటి ఒప్పందాలు ఉన్నాయని చంద్రబాబు వితండవాదం చేయటం సరికాదు. 2017లో చంద్రబాబు దక్షిణ కొరియా వెళ్లి పోస్కో ప్రతినిధుల్ని కలిశారు. దక్షిణ కొరియా వెళ్లిన చంద్రబాబునే పోస్కో ప్రతినిధులు వచ్చి కలిశారని వార్తలు కూడా గొప్పగా రాయించుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారేమో కానీ గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ప్రజలు అందరికీ ఈ విషయాలు తెలుస్తాయి. ప్రజలకు ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు ఎందుకు తప్పించుకుంటున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సంబంధించిన వార్తలు కొన్నేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. 2012లో ఎకనమిక్‌ టైమ్స్‌లో వార్త వచ్చింది. 2014లోనూ విశాఖ ప్రైవేటీకరణపై రకరకాల వార్తలు వచ్చాయి. జాతీయ మీడియా, చంద్రబాబు జాతి మీడియాలోనూ అనేక సందర్భాల్లో వార్తలు వస్తే ఒక్కసారైనా చంద్రబాబు నోరు తెరిచి మాట్లాడారా?'' అని అడిగారు.

''ఏదో ఒకరకంగా సీఎం జగన్ గారిని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు విమర్శలు చేయటమేనా రాజకీయం..? ఇలాంటి మాటలు చంద్రబాబు మాట్లాడటం సరికాదు. గతంలో అశోకగజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే పోస్కోతో ఒప్పందం జరిగింది. మరి, ఆనాడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు. ఆరోజు ఎందుకు ప్రతిఘటించలేదు. ఆనాడు లాలూచీ ఒప్పందాల వల్ల లొంగిపోయి కేంద్రం చేతిలో చంద్రబాబు కీలు బొమ్మలా వ్యవహరించారు. మరి, ఈరోజైనా చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు. ఈ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని ఒక్కమాట కూడా కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయలేకపోతున్నారు'' అన్నారు. 

''విశాఖపట్నం వచ్చిన లోకేశ్‌ అపరమేధావిలా మాట్లాడాడు. టీడీపీ ఏర్పడకముందే, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ కోసం 1978లోనే పోరాడామని లోకేశ్‌ మాట్లాడుతున్నారు. ఏం చెప్పి లబ్ది పొందాలని అనుకుంటున్నారో మీకు అయినా అర్థమవుతుందా...? రకరకాల మాధ్యమాల ద్వారా ప్రజలకు పూర్తి స్థాయి సమాచారం అందుబాటులో ఉంటోంది. లేకపోతే చంద్రబాబు ఆయన మీడియా ప్రజల్ని ఇంకా గాఢాందకారంలోకి నెట్టేవారు. చంద్రబాబు స్థాయి రోజురోజుకీ దిగజారిపోతోంది. రేపు చైనా వారు ఏమైనా భారతభూభాగం ఆక్రమించుకున్నా అది శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి వల్లే ఆక్రమించుకున్నారని చంద్రబాబు అన్నా అంటారు. అమెరికాలో ప్రభుత్వానికి ఏదో జరిగితే.. అది కూడా శ్రీ జగన్ గారి వల్లనే జరిగిందని చంద్రబాబు విమర్శలు చేస్తారు. చివరకు చంద్రబాబు పడుకున్న, లేచినా జగన్ పేరే కలవరిస్తున్నారు. జగన్ అంటే చంద్రబాబుకు ఫోబియాలా ఉంది. అందువల్లనే చంద్రబాబు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు'' అని ఎద్దేవా చేశారు. 

''విశాఖపట్నం అంటే చంద్రబాబు ప్రాణం అంటారు. మరి జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా ప్రకటిస్తే... చంద్రబాబు, ఆయన మీడియా ఎంత విషం చిమ్మింది. విశాఖపట్నం పనికిరాదు. విశాఖను సముద్రం ముంచేస్తుందని రాతలు రాయించిన సంగతి ఎవ్వరూ మర్చిపోలేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శ్రీ జగన్ ప్రయత్నిస్తుంటే చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఏ మొహం పెట్టుకొని  ఈరోజు చంద్రబాబు విశాఖపట్నం వచ్చారు. ఉద్యమాలు ఏవీ ఉత్తరాంధ్రకు కొత్త కాదు. ఉద్యమాల గడ్డ ఇది. విశాఖ ఉక్కు ఎలా సాధించుకున్నామో అందరికీ తెలుసు. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఉద్యమం ద్వారా ఈ ప్రాంత ప్రజలు సాధించుకోగలరు. ఈ ఉద్యమానికి వైయస్‌ఆర్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తోంది. ప్రైవేటీకరణ వార్త వచ్చిన రెండు రోజుల్లోనే మొదటిగా సీఎం శ్రీ జగన్ స్పందించారు. ఏం చేస్తే విశాఖ ఉక్కును కాపాడగలమో పూర్తి వివరాలతో ప్రధానికి లేఖ రాశారు. కమిట్‌మెంట్ ఉన్న నాయకుడుగా జగన్ గారు దూరదృష్టి, ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు'' అని పేర్కొన్నారు. 

''ఉత్తరాంధ్ర ప్రజల దృష్టిని చంద్రబాబు మార్చలేరు. చంద్రబాబు మాటల్ని నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరు. పంచాయితీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ మద్దతుదారులు ఏ విధంగా ప్రభంజనం సృష్టించారో చూశాం... క్లీన్ స్వీప్ చేశారు. ఎన్నికల్లో టీడీపీ ఉనికిని కూడా చాటుకోలేక పోతున్నారు. ఎన్నికల ఫలితాలు చూసేసరికి చంద్రబాబు, లోకేశ్ దాని గురించి మాట్లాడటం లేదు. చివరికి ఫలితాలను తారుమారు చేసుకుంటూ, ఫేక్‌ వెబ్‌సైట్ సృష్టించే దౌర్భాగ్య పరిస్థితికి టీడీపీ వెళ్లిపోయింది. ఫేక్‌ డేటా సృష్టించి, ఫేక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ప్రజలకు పంపించటం ఏం పని చంద్రబాబూ, ఇది చంద్రబాబు స్థాయికి తగునా? చివరకు చంద్రబాబు మాటల మీద విశ్వాసం లేకనే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. మంచి సంకల్పంతో ఉద్యమాలు చేస్తే ప్రజలు దాన్ని హర్షిస్తారు తప్ప ఏదో ఒకటి మాట్లాడి పబ్బం గడుపుకోవాలనే రాజకీయాలు ఈ కాలానికి సరిపోవు. లోకేశ్‌కు మంచి బుద్దిని ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నాను'' అని మంత్రి అప్పలరాజు అన్నారు.