విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం  కురిపించారు. అయితే రజనీకాంత్ వ్యాఖ్యలను ఏపీ మంత్రి ఆర్కే రోజా తప్పుబట్టారు.

విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే రజనీకాంత్ వ్యాఖ్యలను ఏపీ మంత్రి ఆర్కే రోజా తప్పుబట్టారు. రజనీకాంత్ అంటే అందరికి గౌరవమని చెప్పారు. ఆయన సినిమాలు అందరూ చస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్టీఆర్‌కు మైక్ ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబును రజనీకాంత్ పొగడటం చాలా బాధకరమని పేర్కొన్నారు. 

చంద్రబాబు గురించి ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలను రజినీకాంత్ చూసినట్టు లేదని.. కావాలంటే వాటిని ఆయనకు పంపిస్తానని రోజా అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించారని విమర్శించారు. రజినీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానులు బాధపడ్డారన్నారు. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయారని.. ఆయన అధికారంలో లేనప్పుడే హైదరాబాద్‌ అభివద్ది జరిగిందని అన్నారు. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి దివంగత వైఎస్సార్ కారణం అన్నారు. ఈ విషయాలు రజనీకాంత్ తెలుసుకుంటే మంచిదని అన్నారు. చంద్రబాబు విజన్‌ 2020 వల్ల టీడీపీకి 23 సీట్లు వచ్చాయని.. విజన్‌ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌కి తెలుసా అంటూ రోజా ఎద్దేవా చేశారు. ఇన్ని గొప్పలు చెప్పేవాళ్లు 27 ఏళ్లలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు.

Also Read: చంద్రబాబు ఘనత దేశంలోని నాయకులకు తెలుసు.. అది జరిగితే ఏపీ ఎక్కడికో వెళ్లిపోతుంది: రజనీకాంత్

తెలుగు రాష్ట్రాల రాజకీయం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? చంద్రబాబు పిలిచాడు కాబట్టి భజన చేశారా? అనేది అర్థం కాలేదని అన్నారు. ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆ కార్యక్రమం ఏమిటి? దాని గురించి ఏం మాట్లాడుతున్నామనేది ఆలోచించుకోవాలని కౌంటర్ ఇచ్చారు. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుంది అన్నారు. రజనీకాంత్ టీడీపీ మీటింగ్‌లకు రావడం అనేది గతంలో కూడా జరిగిందని చెప్పారు. 2024లో చంద్రబాబు సీఎం అయ్యే ఛాన్సే లేదన్నారు.