Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఘనత దేశంలోని నాయకులకు తెలుసు.. అది జరిగితే ఏపీ ఎక్కడికో వెళ్లిపోతుంది: రజనీకాంత్

తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు ఘనత ఏమిటనేది దేశంలో పెద్ద పెద్ద నాయకులకు తెలుసునని సూపర్ స్టార్‌ రజనీకాంత్ అన్నారు. 

Superstar rajinikanth Praises chandrababu naidu at NTR centenary celebrations in vijayawada ksm
Author
First Published Apr 28, 2023, 8:37 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు ఘనత ఏమిటనేది దేశంలో పెద్ద పెద్ద నాయకులకు తెలుసునని సూపర్ స్టార్‌ రజనీకాంత్ అన్నారు. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  రజనీకాంత్ మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడి చాలా రోజులు అయిందని.. ఏదైనా తప్పైతే తనను క్షమించాలని కోరారు. సభలో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో అనుభవం చెబుతుందని అన్నారు. ఇక్కడ ఉన్న సభ, అభిమానం చూసినప్పుడు రాజకీయం మాట్లాడాలని అనిపిస్తుందని.. అయితే అనుభవం మాత్రం వద్దని అంటుందని చెప్పారు. తాను రాజకీయం మాట్లాడితే మీడియాలో ఏదేదో రాస్తారని అన్నారు. అయితే తన మిత్రుడు చంద్రబాబు గురించి కొద్దిగా రాజకీయం మాట్లాడతానని అన్నారు. 30 ఏళ్ల నుంచి చంద్రబాబు తన మిత్రుడని.. మోహన్ బాబు పరిచయం చేశారని.. పెద్ద నాయకుడు అవుతాడని చెప్పాడని  గుర్తుచేసుకున్నారు.  

హైదరాబాద్ వెళ్లిన సందర్భాల్లో చంద్రబాబును కలిసేవాడినని.. ఆయనతో మాట్లాడుతున్న సమయంలో తన జ్ఞానం పెరిగిందని చెప్పారు. జనాలకు మంచి చేయాలనేదే చంద్రబాబు విజన్ అని తెలిపారు. చంద్రబాబు ఒక విజనరీ అని అన్నారు. భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు చంద్రబాబు ఘనత, ట్యాలెంట్ ఏమిటనేది తెలుసునని అన్నారు. ఇక్కడున్నవాళ్లకంటే.. బయటవాళ్లకు ఈ విషయం బాగా తెలుసునని కామెంట్ చేశారు.

‘‘1996-97లో విజన్ 2020 అని చంద్రబాబు చెప్పారు. ఐటీకి ఎలా ఫ్యూచర్ ఉందని తెలిపారు. అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఆయన అప్పుడు చెప్పిందే హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చింది. బిల్ గేట్స్ లాంటి వాళ్లు హైదరాబాద్‌కు వచ్చారు. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు నేడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మొన్న హైదరాబాద్‌‌లో కొన్ని ప్రాంతాలను  చూస్తే ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అని అనిపిచింది. హైదరాబాద్ ఎకానమిక్‌‌గా ఎంతో ఎదుగుతోందో అందరికి తెలుసు. 

చంద్రబాబు ఎప్పుడగిడినా నాకు అపాయింట్‌మెంట్ ఇస్తారు. నా జన్మదినం రోజున  ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇప్పుడు చంద్రబాబు  నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ ఏపీకి 2047కు ఏం చేయాలని ఇప్పుడే ప్లాన్ చేస్తారు. అదంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్‌ ఇండియాలో ఎక్కడికో వెళ్లిపోతుంది. దేవుడి దయ వల్ల అది జరగాలి.  ఎన్టీఆర్‌ ఆత్మ చంద్రబాబుకు తోడుగా  ఉండాలి’’ అని అన్నారు. ఇక, తన ప్రసంగం మొదలుపెట్టే సమయంలో తమ్ముడు బాలకృష్ణ, అప్తమిత్రులు చంద్రబాబు అని రజనీకాంత్ ప్రస్తావించారు.

బాలకృష్ణ కంటి చూపుతోనే చంపేస్తాడని.. ఒకతోపు తోస్తే జీపు 20 మీటర్లు వెళ్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. అలాంటి సన్నివేశాలు రజనీకాంత్, అమితాబ్, షారూఖ్ చేస్తే ఒప్పుకోరు.. బాలయ్య చేస్తే మాత్రమే ఒప్పుకొంటారనీ అన్నారు. ఎందుకంటే తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను బాలయ్యలో చూస్తున్నారని అన్నారు.

నందమూరి తారకరామరావు తనను ఎంతగానో ప్రభావితం చేశారని రజనీకాంత్ చెప్పారు. తన జీవితంలో చూసిన తొలి సినిమా పాతాళ భైరవి అని.. అప్పుడు తన వయసు ఆరేడేళ్లని తెలిపారు.  అది నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందని అన్నారు. తాను హీరోగా  చేసిన మొదటి సినిమా పేరు భైరవి అని  చెప్పారు. 1963లో లవ కుశ సినిమా వేడుకల సమయంలో ఎన్టీఆర్‌ను బెంగళూరులో ప్రత్యక్షంగా చూశానని.. అప్పుడు తనకు 13 ఏళ్లు అని చెప్పారు. శ్రీ కృష్ణ పాండవీయంలో ఎన్టీఆర్‌ను చూసి మైమరిచిపోయానని తెలిపారు. తాను కండక్టర్ అయ్యాక ఎన్టీఆర్‌ను  అనుకరించి నటించాను.. అప్పుడు తన మిత్రులు సినిమాల్లోకి వెళ్లాలని  ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. 

ఎన్టీఆర్ ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అన్నారు. 1977లో తాను ఎన్టీఆర్‌తో టైగర్‌ సినిమాలో యాక్ట్ చేశానని గుర్తుచేశారు. ఆ సినిమాలో తనను నిర్మాతలు వద్దని అంటే.. ఎన్టీఆర్ పట్టుబడి ఉండేలా చేశారని చెప్పారు. ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ ఎన్నిసార్లు చూశానో తనకే తెలియదని అన్నారు. ఎన్టీఆర్, శివాజీ, రాజ్‌ కుమార్‌లతో సమయం గడిపే అవకాశం తనకు దొరికిందని చెప్పారు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎన్టీఆర్‌ది గొప్ప వ్యక్తిత్వం  అన్నారు. 

పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని అన్నారు. అప్పుడు ఇందిరా గాంధీ శక్తిమంతురాలుగా ఉన్నారని.. అలాంటి పార్టీని ఓడించి ఏపీలో అధికారం దక్కించుకుని సంచలనంగా మారాని చెప్పారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios