టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ మంత్రి రోజా. నారా లోకేష్ పార్టీలోకి వచ్చాకే టీడీపీ నాశనమయ్యిందంటూ విమర్శించారు.
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ మంత్రి రోజా.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై మరోసారి మంత్రి రోజా విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు టూరిస్ట్ లా వచ్చి రాజకీయాలు చేస్తున్నారని.. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ల మీద రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. పాదయాత్ర జరిగిన రోజే అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న గురించి ప్రస్తావించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తారకరత్న గుండెపోటుతో సీరియస్ కండిషన్లో ఉన్నాడని.. అతనిని నారా లోకేష్ కనీసం పట్టించుకోలేదని.. అలాంటి వ్యక్తి లోకేష్ అంటూ విరుచుకుపడ్డారు.
ఈ మేరకు మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. ‘పుత్తూరులో లోకేష్ సభకు జనం ఎవరు రాలేదు. దీంతో చివరికి తమిళనాడు, కర్ణాటకల నుంచి జనాలను తెప్పించి మీటింగ్ పెట్టారు. ఒక రోజంతా జనం రాలేదని ఎదురు చూశారు. ఇలాంటి వారే మీరా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని నారా లోకేష్ ఇష్టారీతిన దుర్భాషలాడుతున్నాడు. లోకేష్ కి అంత సీన్ లేదు. జగన్ పులి అయితే.. లోకేష్ పులకేశి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసే నీతిమాలిన రాజకీయాలు అందరికీ తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తారు.
మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత
మీరెలాంటి వారో అందరికీ తెలుసు. హెరిటేజ్ వాహనాల్లో మీరు ఎర్రచందనాన్ని ఎలా తరలించారు కొత్తగా చెప్పనక్కరలేదు.. అందరికీ తెలిసిన విషయమే. మీరే ఎర్రచందనం దొంగలు. వైసిపి వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ల పళ్ళు రాలగొడతాను. నేను షూటింగ్ లు చేసి కష్టపడి డబ్బులు సంపాదించుకున్నా. ఇంత మాట్లాడుతున్న టిడిపి నేతలు చంద్రబాబు హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వారిని కూడా గాలికి వదిలేసే చరిత్ర లోకేష్ కుటుంబానిదని విమర్శించారు. లోకేష్ కి ఫ్రస్టేషన్ పెరిగింది. పాదయాత్రలకు జనం రావడం లేదు. దీంతో ప్రస్టేషన్ పెరిగే నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతున్నాడన్నారు. నారా లోకేష్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాకే టిడిపి నాశనమైందంటూ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు రోజా.
