మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత
మాజీ మంత్రి కుతూహలమ్మ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు.
చిత్తూరు: మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ బుధవారం నాడు కన్నుమూశారు. ఆమె వయస్సు 74 ఏళ్లు. ఇవాళ ఉదయం తన నివాసంలో ఆమె మరణించినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. సుధీర్ఘకాలం పాటు ఆమె కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో కుతూహలమ్మ ప్రవేశించారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి కుతూహలమ్మ గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత టీడీపీ తరపున పోటీచేసి ఆమె ఓటమి పాలయ్యారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన కుతూహలమ్మ డాక్టర్ గా చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించేవారు. 1979 లో యూత్ కాంగ్రెస్ ద్వారా ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1980-1985 మధ్య చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కుతూహలమ్మ పనిచేశారు. కుతూహలమ్మను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా చేయడంలో చంద్రబాబునాయుడు కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
1985లో వేపంజేరి అసెంబ్లీ స్థానం నుండి కుతూహలమ్మ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1991లో ఆమెకు మంత్రి పదవి దక్కింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా కుతూహలమ్మ పనిచేశారు. 2007-09 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా కుతూహలమ్మ పనిచేశారు. 2016 ఎన్నికల ముందు కుతూహలమ్మ కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు.