జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి రోజా. ఆయన ఎన్నటికీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించలేరని మంత్రి సెటైర్లు వేశారు. టీడీపీ, బీజేపీలను పవన్ కల్యాణ్ ఎన్నడూ ప్రశ్నించలేదని... ఆయన జనంలో తిరగరంటూ ఆమె ఎద్దేవా చేశారు.

వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి మంత్రి ఆర్కే రోజా (rk roja) ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేస్తామని ఆమె చెప్పారు. బీజేపీతో (bjp) కలవాల్సిన అవసరం తమకు లేదని.. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి టీడీపీయే కారణమని రోజా వెల్లడించారు. ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఎప్పటికీ స్థానం సంపాదించలేరని... జనసేన డిజిటల్ క్యాంపెయిన్ (janasena digital campaign) హాస్యాస్పదమని మంత్రి పేర్కొన్నారు. పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా వేరే పార్టీలకు ఓటేయమని చెప్పిన వ్యక్తి పవన్ ఒక్కడేనని రోజా సెటైర్లు వేశారు. రాష్ట్రంలో టీడీపీ (tdp) ప్రభుత్వం నాసిరకం పనులు చేపట్టిందని.. రోడ్ల దుస్థితికి తెలుగుదేశం పార్టీయేనని రోజా ఆరోపించారు. టీడీపీ, బీజేపీలను పవన్ కల్యాణ్ ఎన్నడూ ప్రశ్నించలేదని... ఆయన జనంలో తిరగరంటూ ఆమె ఎద్దేవా చేశారు. 

కాగా... ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిని తెలుపుతూ.. ముఖ్యమంత్రిని మేల్కొలిపే #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ ను జనసేన ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మరో వ్యంగ్య కార్టూన్ ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం 8 గం.కు పవన్ కళ్యాణ్ రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను ట్విటర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోలో కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి తెలుస్తోంది. ఈ వీడియోను పోస్టు చేస్తూ #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ వేశారు. 

Also Read:Good Morning CM Sir : సీఎం సార్.. ఇదీ రోడ్ల దుస్థితీ.. మరో వీడియో, కార్టూన్ ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్..

దీంతోపాటు రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలియచేసేలా ఉన్న వ్యంగ్య చిత్రాన్నిపవన్ కళ్యాణ్ గారు పోస్టు చేశారు. హెలికాప్టర్ లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళను వింతగా చూస్తుంటారు. ఒక్కో గోతిలో నుంచి గాల్లో ఎగిరి అంతా దూరాన మరో గోతిలో ఉన్న నీళ్ళలో పడుతుంటే వారి వాహనాలు గాల్లో ఉన్నట్లు ఆ వ్యంగ్య చిత్రం ఉంది. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్నవారిని పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఆ కార్టూన్ తెలియచేస్తుంది. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవలి కాలంలో రోడ్లు బాగా పాడయ్యాయని.. రోడ్లు వేయండి మహాప్రభో అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. జగనన్న ‘ఉయ్యాలా-జంపాలా’ పథకంలో భాగమే ఈ రోడ్లని సోషల్ మీడియా వేదికగా రోడ్ల దుస్థితిని షేరు షేస్తూ మీమ్స్, సెటైర్స్ వెల్లువెత్తుతుంటాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరీ దారుణంగా మారిపోయాయి. దీనిమీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా గురువారం కూడా ఓ కార్టూన్ కౌంటర్ ఇచ్చారు.