సారాంశం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు , టీడీపీ నేతలు ఏం మాట్లాడితే పురందేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారని రోజా ఆరోపించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అప్పులు తక్కువేనని నిర్మలా సీతారామన్ చెప్పారని ఆమె గుర్తుచేశారు. 

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మంత్రి రోజా మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలా..? లేక టీడీపీ అధ్యక్షురాలా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు , టీడీపీ నేతలు ఏం మాట్లాడితే పురందేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారని రోజా ఆరోపించారు. ఏపీ అప్పుల్లో వుందని పురందేశ్వరి చెబుతున్నారని.. కానీ అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువేనని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని రోజా గుర్తుచేశారు. మరి నిర్మల చెప్పింది తప్పా..? పురందేశ్వరి చెబుతున్నది తప్పా అని ఆమె డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ హయాంలోనే తలకుమించిన అప్పులు చేశారని రోజా ఫైర్ అయ్యారు. ఏదో ఒక మ్యాప్ తీసుకుని చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. మరి 14 ఏళ్లు సీఎంగా వుండి గాడిదలు కాశారా అని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో వున్నప్పుడు సంక్షేమం , అభివృద్ధి అనేది ఆయనకు గుర్తుకురాదని.. విపక్షంలో వున్నప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడుతారని ఆమె దుయ్యబట్టారు. అలాగే నదుల అనుసంధానం కన్నా నిధుల అనుసంధానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని మంత్రి రోజా ఆరోపించారు. 

Also Read: పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో తేలాలి: రోజా సంచలనం

అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యం వుంటే ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చునని, పార్టీ పెట్టొచ్చునని ఆమె పేర్కొన్నారు. పవన్ జనసేనను స్థాపించి పదేళ్లు కావొస్తున్నా స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేయలేదని.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ఆయన ధ్యేయమని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.