విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ అధికారుల సోదాల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. దీనికి సంబంధించి మంత్రి పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

దుర్గగుడిలో ఏసీబీ  సోదాలు చేస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నాని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎవరి కోసమో రైడ్లు చేసే చంద్రబాబు ప్రభుత్వం కాదిది అంటూ నాని చురకలంటించారు.

చంద్రబాబు లాగా పది గురువులు, పది మతాలు మార్చట్లేదు కదా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా నాని మండిపడ్డారు. 

దుర్గ గుడి ఈవో తప్పు చేశారని.. లెక్క తేలితే బొక్కలు పగులుతాయని హెచ్చరించారు.  అవినీతిని ఊపేక్షించే విషయంలో ఈవో లేదు.. డీవో లేదు.. అందరి  మీద చర్యలు తీసుకుంటామన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మేం.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందలేమా..? అని పేర్కొన్నారు.  అవసరాల కోసం ఓటర్లకు ఎర వేసే పార్టీ తమది కాదని..అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం జగన్‌ ప్రతీ సందర్భంలో చెబుతూనే ఉన్నారని పేర్కొన్నారు.  

మతాలు మార్చే వ్యక్తి చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు బుర్రను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని..ఆయన మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలని ఎద్దేవా చేశారు.