ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. సినిమా టికెట్ల ధరల పెంపు, థియేటర్ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ చేసిన అధ్యయనంపై సీఎంకు నాని వివరించారు.  

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపు (movie tickets issue) అంశానికి సంబంధించి జగన్ సర్కార్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో (ys jagan) సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని (perni nani) భేటీ అయ్యారు. రేపు మధ్యాహ్నం సీఎం జగన్‌తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల భేటీ వున్న నేపథ్యంలో జగన్‌తో పేర్ని నాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

బుధవారం విశాఖ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్ వెంటనే పేర్నినానితో సమావేశమయ్యారు. 
రేపటి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎంతో చర్చిస్తున్నారు మంత్రి పేర్ని నాని. సినిమా టికెట్ల ధరల పెంపు, సినిమా పరిశ్రమకు ప్రయోజనాలు కల్పించే అంశాలపై చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక, టికెట్ల ధరల పెంపు అంశంపై రేపు హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం చెప్పాలనే అంశంపై జగన్‌ మంత్రి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 

కాగా.. ఈ నెల 10న సీఎం జగన్ తో చిరంజీవి (chiranjeevi) సహా ఇతర సినీ ప్రముఖుల సమావేశం వున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక దాదాపు సిద్దమైంది. ఈ క్రమంలోనే సినిమా ప్రముఖులతో భేటీలో వారి అభిప్రాయాలు తీసుకుని చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. అలాగే సినిమా ధియేటర్ల యజమానుల సమస్య పరిష్కారంపైన చర్చ జరిగే అవకాశాలున్నాయి.

మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతితో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరలు తెలంగాణలో పెంచారని.. ఏపీలో తగ్గించారని చెప్పారు.కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారని తెలిపారు. అందుకే సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలని అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందకెళ్తామని చెప్పారు. రెండు ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నాయని అన్నారు.

చిరంజీవి, సీఎం జగన్ మీటింగ్‌‌కు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నపై స్పందించిన మంచు విష్ణు.. పర్సనల్ మీటింగ్‌ను అసోసియేషన్ మీటింగ్‌గా భావించకూడదని అన్నారు. సినీ ఇండస్ట్రీ అంతా పెద్ద కుటుంబం అని చెప్పారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించింది కరెక్టా..?, పెంచింది కరెక్టా..? అనేది లాంగ్ డిబేట్ అని అన్నారు. ఇండస్ట్రీ‌లో ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయని తెలిపారు. తాను విడిగా మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించలేనని చెప్పారు.