అక్రమ కట్టడాల నిర్మూలనలో భాగంగా..ప్రజా వేదికను కూల్చివేయాలని సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే... దానిని కూల్చడం వల్ల నష్టం జరుగుతుందని టీడీపీ నేతలు ఒక్కోక్కరుగా వాపోతున్నారు. చంద్రబాబుకి ఆ భవనం ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే దానిని కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా... ఈ విషయంపై మంత్రి పేర్ని నాని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ప్రజావేదికను కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో టీడీపీ నేతలు ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారన్నారని ఏపీ మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. అక్రమ కట్టడం కూల్చివేస్తామంటే వాళ్లకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. 

వరద బాధితుల్లా టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రజావేదిక కూల్చడం వల్ల పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని.. కేవలం కోటి రూపాయలు మాత్రమేనని లెక్కగట్టారు. అవినీతికి కేరాఫ్ అడ్రసైన యనమల.. ముఖ్యమంత్రి జగన్‌పై ఆరోపణలు ఎలా చేస్తారన్నారు. ప్రజావేదికతో మొదలుపెట్టి అన్ని అక్రమ కట్టడాలు కూల్చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని నాని స్పష్టం చేశారు.