ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులపై అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానా..? గ్రామమా అంటూ ప్రశ్నించారు. రాజధాని నగరం తయారీకి వందేళ్లు పడుతుందని, 10 శాతం ప్రజలకూ సచివాలయం, హైకోర్టుతో అవసరం ఉండదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి రాజధానిపై ప్రకటన చేస్తామని ఆయన వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితం... రాజధాని కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి ఇవ్వొచ్చని పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కోన్నారు.  రాజధాని రైతుల భూములను ఎవరు లాక్కుని వెళ్ళటం లేదు కాబట్టి వారు నిశ్చింతగా వుండోచ్చని  మంత్రి  అన్నారు. 

Also Read:రాయలసీమ రాజధాని అవసరమే లేదు... కావాల్సిందిదే: మంత్రి పెద్దిరెడ్డి

బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ నివేదిక జనవరి 3 తేదీన వస్తుందన్నారు. ఆ తర్వాతే రాజధానిపై తుది నిర్ణయం ఉంటుందన్నారు. అభివృద్ది చెందిన ప్రాంతాలనే మళ్లీ అభివృద్ది చేయడం కాకుండా ఇతర ప్రాంతాలను కూడా వాటితో సమానంగా  తీర్చిదిద్దాలని తాము భావిస్తున్నామని... వారు బాగుపడటం మీకు అక్కరలేదా అని అమరావతి ప్రాంత ప్రజలను మంత్రి ప్రశ్నించారు.

సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ద్వారా  రాష్ట్రమంతటా సమాన అభివృద్ధి జరుగుతుందన్నారు. రైతులకు న్యాయం చేయాలనే సీఎం  చూస్తున్నారని అన్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సేవలు చంద్రబాబు కూడా గతంలో చాలా సార్లు తీసుకున్నారని మంత్రి గుర్తుచేశారు.

పదేళ్లు హైదరాబాద్ ను రాజధానిగా వాడుకునే అవకాశమున్నా వదిలేసి అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. కేవలం రాజధానికి పేరుతో ఆయన కేవలం వ్యాపారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మి భూమిలిచ్చిన రైతులకు జగన్ ఎలాంటి అన్యాయం చేయరని... మంచి ప్యాకేజి ఇచ్చి రైతులకు న్యాయం చేస్తారని తెలిపారు.

Also Read:ఎట్టి పరిస్థితుల్లో అది జరిగితీరాలి: అధికారులకు సీఎం ఆదేశం

గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని రోడ్డుపాలు చేశారని అన్నారు. 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసేయాలంటే సాధ్యం కాదని... తగుమాత్రంలో భూమి తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్ అని కొత్త విధానంలో భూమిని తీసుకున్నారని... మళ్ళీ అదే విధానంలో తిరిగి వెనక్కు కూడా ఇవ్వొచ్చని తెలిపారు. 

రాయలసీమకు కావాల్సింది సచివాలయం కాదు... ముడుపుటలా తాగు, సాగు నీళ్లు మాత్రమే...రాజధాని ఎక్కడ ఉన్నా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికిప్పుడు  అమరావతి రైతులతో మాట్లాడాల్సిన పని లేదని... వారు మాట వినరని కూడా తమకు తెలుసని మంత్రి పెద్దిరెడ్డి మనసులో మాట బైటపెట్టారు.