టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వుండి కుప్పానికి ఏం చేశావంటూ ఆయన నిలదీశారు. ఇక్కడి ప్రజలు తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

చిత్తూరు జిల్లాలో ఇప్పుడే కాదే ఎప్పుడూ చంద్రబాబుకు మెజారిటీ రాదని ఆయన స్పష్టం చేశారు. 1996 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబుకు మెజారిటీ రాలేదని పెద్దిరెడ్డి గుర్తుచేశారు.

చంద్రబాబు అంతగొప్ప ప్రజా నాయకుడైతే రాష్ట్రం దాకా అక్కర్లేదు.. సొంత జిల్లాలోనే మెజారిటీ ఎందుకు తెచ్చుకోలేదని ఆయన దుయ్యబట్టారు. నీ గురించి, ఎస్ఈసీ నిమ్మగడ్డ గురించి నాకంటే బాగా తెలిసిన వారు ఈ రాష్ట్రంలో లేరని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.

Also Read:బెదిరించి ఏకగ్రీవాలు: పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బాబు

మీరు ఎక్కడ చదివారో నేను అక్కడే చదువుకున్నానని, మీరు ఎంత కుట్రదారులో అందరికీ తెలుసునని పెద్దిరెద్ది ఎద్దేవా చేశారు. పోటుగాడా అని నన్ను వ్యాఖ్యానించిన చంద్రబాబుకు సంస్కారం వుందా లేదా అని మంద్రి ప్రశ్నించారు.

వైసీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలను చంద్రబాబుకు టీడీపీలోకి లాక్కెళ్లారని.. నీది కూడా ఒక క్యారెక్టరా అని రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని.. చంద్రబాబు ఏరోజైనా ప్రజల కోసం పనిచేశారా..? అని పెద్దిరెద్ది ప్రశ్నించారు.

ఒకే ఒక్క వ్యక్తికి కోవిడ్ వస్తే నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారని.. మరి ఇప్పుడు పరిస్ధితి తెలిసి కూడా ఎన్నికలు ఎందుకు పెడుతున్నారని రామచంద్రారెడ్డి నిలదీశారు. నిమ్మగడ్డ, చంద్రబాబు బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, నిమ్మగడ్డ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.