అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరించి ఏకగ్రీవాలు చేసుకొంటున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. పల్లెప్రగతి -పంచ సూత్రాల పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ రూపొందించింది.వైసీపీ చెబుతున్న ఏకగ్రీవాలు ప్రజామోదంతో జరిగినవి కావన్నారు. దాడులు, దౌర్జన్యాలతో బలవంతంపు ఏకగ్రీవాలు చేసుకొంటున్నారని ఆయన వైసీపీపై మండిపడ్డారు. 

గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఏకగ్రీవాలు జరగలేదన్నారు. ఇటీవల జరిగిన విధ్వంసాలే ఈ ఏకగ్రీవాలకు కారణంగా ఆయన చెప్పారు. తంబాలపల్లి, పుంగనూరులలో మొత్తం ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకొన్నారని  చంద్రబాబునాయుడు ఆరోపించారు. 

ఈ గ్రామాల్లో పోటీ చేసే వారే లేరా అని ఆయన ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది కుంటుపడిందని ఆయన విమర్శించారు. ఏపీ ఫైబర్ నెట్లలో ఛానెల్స్ ను నిలిపివేసే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. సమర్ధవంతమైన నాయకత్వాన్ని తీసుకొని రావడం ద్వారా  గ్రామాలను అభివృద్ది చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. 

 గ్రామాల్లో సమర్ధవంతమైన పాలన కోసమే ఈ పంచసూత్రాలని ఆయన చెప్పారు. ఉచిత కుళాయిలతో రక్షిత మంచినీరు అందిస్తామన్నారు. ప్రజల భద్రత-ప్రశాంతతకు భరోసాను కల్పిస్తామని ఆయన చెప్పారు.

ఆలయాలపై దాడులు అరికట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్వచ్ఛథ పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శ గ్రామాలు తీర్చిదిద్దటమే లక్ష్యమని ఆయన చెప్పారు.వ్యవసాయ మోటార్లకు మీటర్లను అడ్డుకొంటామన్నారు. ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలందిస్తామన్నారు.