తాను కేవలం సీఎం చంద్రబాబు, తమను ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మాత్రమే భయపడతానని మంత్రి పరిటాల సునీత తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెట్టింపు పింఛన్లు, పసుపు-కుంకుమ సొమ్ము అందజేత కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మొరిగే కుక్కలను చూసి తాను భయపడనని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీకి, తమ కుటుంబానికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు గ్రామాల్లో చిచ్చు రేపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు తమ ప్రభుత్వ చేపట్టిందని చెప్పారు.

పార్టీలకతీతంగా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తోపుదుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేశామన్నారు. మహిళలకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇచ్చి పసుపు-కుంకుమ కార్యక్రమం చేపడితే అది చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు దుర్బుద్ధితో అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.