మహ్మద్ ప్రవక్త చూపించిన మార్గాన్ని ప్రతి ముస్లిం అనుసరించాలని పిలుపునిచ్చారు ఏపీ మంత్రి నారా లోకేశ్. రంజాన్ మాసం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం తాడపల్లి మండలం వడ్డేశ్వరంలో సొమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. మండుటెండలను కూడా లెక్క చేయకుండా కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు అల్లా శక్తినివ్వాలని ఆకాంక్షించారు. నిష్టగా చేసే దీక్షలే రక్షగా రంజాన్ మాసాన్ని పూర్తి చేయాలని లోకేశ్ తెలిపారు.

అసత్యాలకు, దూషణలకు దూరంగా ఉండటం, దయాగుణం, దాన గుణం కలిగి ఉండటం సత్ప్రవర్తనా మార్గాలను అనుసరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. రంజాన్ మాసంలో చేపట్టిన దీక్షలతో భగవంతుని ఆశీస్సులు అందరికీ తప్పక లభిస్తాయని లోకేశ్ తెలిపారు.

మైనారిటీలకు అండగా ఉంటానని.. ప్రజల సహకారం, అల్లా ఆశీస్సులతో పేదరికం లేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. మత సామరస్యానికి సంకేతకంగా అలనాటి లవకుశ సినిమాలో లవకుశ పాత్రధారులను మంత్రి సన్మానించారు.

అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు... కార్యక్రమంలో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.