టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి మేరుగు నాగార్జున. దళిత సంక్షేమానికి సంబంధించి చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు మధ్య ఎంతో తేడా వుందన్నారు. దీనిపై చర్చకు సిద్ధమంటూ ఆయన సవాల్ విసిరారు.
చంద్రబాబు (chandrababu naidu) హయాంలో దళితులపై దాడి జరిగితే ఆయన దగ్గర ఊడిగం చేస్తారా అంటూ టీడీపీలోని (tdp) దళిత నేతలపై మండిపడ్డారు మంత్రి మేరుగు నాగార్జున (merugu nagarjuna) . అంబేద్కర్ దళితులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తే... చంద్రబాబు కల్పించారని చెబుతారా అంటూ మంత్రి ఫైరయ్యారు. జగన్ పాలన (ys jagan) చూసి మీరు బెంబేలెత్తిపోతున్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ సిద్ధాంతాలను గుండెల నిండా నింపుకుని జగన్ పాలన చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు.
నవరత్నాల పేరుతో ప్రతి పేదవాడి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నారని నాగార్జున అన్నారు. దీనిని చూసి ఓర్వలేక.. జగన్ గురించి వున్నవి లేనివి మాట్లాడతారా అంటూ ఆయన టీడీపీ నేతలపై ఫైరయ్యారు. బడుగు, బలహీన వర్గాలకు మంత్రి పదవులు అప్పగించి సామాజిక విప్లవానికి జగన్ తెరదీశారని మంత్రి కొనియాడారు. దళితులను అడుగడుగునా అణచివేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడంటూ ఫైరయ్యారు. దళితులపై దాడులు జరిగినప్పుడు చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడారా అని అని నాగార్జున ప్రశ్నించారు.
మేం తలచుకుంటే మీరు ఈ రాష్ట్రంలో వుండలేరంటూ వర్ల రామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో దళితులంతా ఆనందంగా వున్నారని మంత్రి చెప్పారు. ఏనాడైనా దళిత సంక్షేమం, అభివృద్ధి గురించి ఎన్నోసార్లు చర్చకు రమ్మని ఆహ్వానించామని కానీ ఏనాడూ స్పందించలేదని నాగార్జున దుయ్యబట్టారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం దళితులను ఎన్నో విధాలుగా ఆదుకుందని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు ఎంతమంది దళితులకు మంత్రి పదవులు ఇచ్చారని నాగార్జున ప్రశ్నించారు.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఛార్జీలు (rtc charges) sపెంచడంపై జగన్ సర్కార్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) విమర్శలు గుప్పించారు. ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ జోరు చూస్తుంటే.. గాలి పీల్చినా, వదిలినా టాక్సులు వసూలు చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడుకి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం అంటూ సోషల్ మీడియా వేదికగా లోకేష్ మండిపడ్డారు.
బుధవారం ఆయన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. తాడేపల్లి రూరల్ మండలం కొలనుకొండ గ్రామంలో పర్యటించిన నారా లోకేష్ .. ఇంటింటికి వెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇటీవల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను పరామర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఇంటికో కోవొత్తు, అగ్గిపెట్టె పంచిపెట్టారు.
