ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) హఠాన్మరణం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నిపింది. అయితే గౌతమ్ రెడ్డికి మృతి ముందు చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) హఠాన్మరణం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నిపింది. ఆయన తల్లిదండ్రులు, భార్య, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు జూబ్లీహిల్స్‌లోని గౌతమ్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. అయితే గౌతమ్ రెడ్డికి మృతి ముందు చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు.
గౌతమ్ రెడ్డి వ్యాయమం చేస్తూ ఇబ్బంది పడ్డారన్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్ హాజరైన గౌతమ్ రెడ్డి సంతోషంగా గడిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫంక్షన్‌లో పాల్గొన్న అనంతరం రాత్రి 9.45 గంటలకు ఇంటికి చేరుకున్నారని తెలిపారు. ఉదయం 6 గంటలకు రోజులాగే మేల్కొన్నారని చెప్పారు. ఉదయం 6.30 గంటల వరకు ఫోన్ చూసుకుంటూ గడిపారని తెలిపారు. ఉదయం 7 గంటలకు సోఫాలో కూర్చున్నారని తెలిపారు.

ఉదయం 7.12 నిమిషాలకు డ్రైవర్‌ను పిలవాల్సిందిగా గౌతమ్ రెడ్డి వంటమనిషికి చెప్పారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఉదయం 7.15 గంటలకు హఠాత్తుగా గుండెపోతుతో సోపా నుంచి కిందకు ఒరిగిపోయారని తెలిపారు. దీంతో 7.16 గంటలకు కంగారు పడిపోయిన గౌతమ్ రెడ్డి భార్య.. శ్రీకీర్తి గట్టిగా అరిచింది. 7.18 గంటలకు డ్రైవర్ గౌతమ్ రెడ్డి చాతిపై చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం అందించాడని చెప్పారు.
ఉదయం 7.20 గౌతమ్ రెడ్డి పక్కనే ఉన్న భార్య శ్రీకిర్తి ఉన్నారని.. మంచి నీళ్లు ఇచ్చిన తాగలేదని పరిస్థితుల్లో ఆయన వెళ్లిపోయాడని తెలిపారు. దీంతో శ్రీకిర్తి వెంటనే ఆయన వ్యక్తిగత సిబ్బందిని పిలిచినట్టుగా చెప్పారు. దీంతో గౌతమ్ రెడ్డి సిబ్బంది.. వెంటనే ఆస్పత్రికి వెళ్దామని బయలుదేరి.. ఉదయం 7.32కి అపోలో ఆస్పత్రికి చేరుకున్నట్టుగా తెలిపారు. ఉదయం 8.15 గంటలకు పల్స్ బాగానే ఉందని చెప్పి వైద్యులు చికిత్స అందించినట్టుగా చెప్పారు. ఉదయం 9.13కి గౌతమ్ రెడ్డి కన్నుమూత అని వైద్యులు నిర్దారించినట్టుగా వెల్లడించారు.
ఇక, మేకపాటి గౌతమ్‌రెడ్డి తన తండ్రి రాజమోహన్‌రెడ్డి అడుగుజాడల్లో 2014లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచిన గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబం విషయానికి వస్తే.. ఆయన తల్లిదండ్రులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి. ఆయనకు భార్య మేకపాటి శ్రీకీర్తి, కూతురు అనన్య రెడ్డి, కుమారుడు అర్జున్ రెడ్డి ఉన్నారు. కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే అర్జున్ రెడ్డి స్వదేశానికి బయలుదేరేందుకు సిద్దమయ్యారు. అర్జున్ రెడ్డి రేపు స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది.
