చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో అందరిది ఒకదారైతే ఆ మంత్రిది మాత్రం మరోదారి. మంత్రివర్గం ఏర్పాటైనప్పటి నుండి ఆ మంత్రిది అదే దారి. ఇంతకీ ఆథ మంత్రి ఎవరా అనేగా మీ సందేహం. ఆయనే భాజపా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. చంద్రబాబు మంత్రివర్గంలో  భారతీయ జనతా పార్టీ తరపున ఉన్న ఇద్దరు మంత్రుల్లో మాణిక్యాలరావు కూడా ఉన్నారు. భాజపా మంత్రి కామినేని చంద్రబాబుతో బాగా కలిసిపోయినా మాణిక్యాలరావు మాత్రం స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు.  

ఏ విషయాన్నైనా సరే, మాణిక్యాలరావు చంద్రబాబు మొహం మీదే చెప్పేస్తుంటారు. దాంతో చంద్రబాబు కూడా మాణిక్యాలరావుతో ఏమన్నా చెప్పాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్ధితి. తాజాగా మంత్రి నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో జన్మభూమి కార్యక్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

మంత్రికి, జిల్లా పరిషత్ ఛైర్మన్ బాపిరాజు, మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ కు అస్పలు పడటం లేదు. దాంతో మున్సిపాలిటీ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీనివాసులు మంత్రిని పిలవటం లేదు. అదే విధంగా జిల్లా పరిషత్ సమావేశాల్లో కూడా ఛైర్మన్ బాపిరాజు మంత్రి మాట చెల్లుబాటు కాకుండా అడ్డుకుంటున్నారు. దాంతో మొన్నటి జన్మభూమి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏకంగా ప్రభుత్వంతో పాటు చంద్రబాబును కూడా టార్గెట్ చేస్తూ బహిరంగంగానే మండిపడ్డారు.

దాంతో పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి-భాజపా నేతల మధ్య ముదిరిపోయిన వివాదాలు రోడ్డునపడ్డాయి. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పించిన ఏర్పాట్లు సరిగా లేవంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. పుష్కరాలకు తనను దూరంగా ఉంచటంపై చంద్రబాబునే అందరిముందూ నిలదీసారు.

అంతకుముందు కూడా మంత్రుల వ్యక్తిగత సిబ్బంది నియామకం విషయంలో కూడా చంద్రబాబు ఆదేశాలను మంత్రి లెక్క చేయలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం సూచించిన వ్యక్తలను కాదని తనకు నమ్మకస్తులైన వారినే తన పేషీలో నియమించుకోవటం అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.

ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో మంత్రి చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారిపోయారు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. దాని పర్యవసానమే మొన్నటి జన్మభూమి కార్యక్రమంలో మాణిక్యాలరావు మండిపాటు. వివాదాన్ని సర్దుబాటు చేయటానికి చంద్రబాబు మంత్రులు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రతో ఎంఎల్ఏ వర్మతో కమిటీ వేసినా పెద్దగా ఉపయోగం ఉండదని పార్టీ వర్గాలే అంటున్నాయి. మరి, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో బయటపడిన వివాదాలు భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.