సీఎం జగన్మోహనరెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. మంగళవారం నందివాడ మండలం లక్ష్మీనరసింహపురంలో ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .

ఈ సందర్భంగా తనపై కథనాలు ప్రచురిస్తున్న పత్రికలు, ఛానెల్స్‌పై ఆయన మండిపడ్డారు. మీ ఛానల్స్ , పత్రికల్లో నా ఫొటో తప్ప ఎవరి ఫొటోలు పెట్టుకోకున్నా అభ్యంతరం లేదన్నారు .

మీ ఛానల్స్ ఎంత , మీ బతుకులెంత అంటూ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు . అవి టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అంటూ ఎద్దేవా చేశారు . జగన్మోహనరెడ్డికి రాజకీయంగా అంగుళం హాని తలపెడితే మీకు అడుగు దిగుద్దని నాని హెచ్చరించారు .

Also Read:పేకాటలో నా అనుచరులుంటే ఏమైంది... ఉరిశిక్ష వేస్తారా?: మంత్రి కొడాలి నాని

మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని ఆయన సూచించారు. సీఎం జగన్మోహనరెడ్డిని ఏమీ చేయలేక ఆయనపై బండలు వేయడమే పనిగా పెట్టుకున్నారని నాని ఎద్దేవా చేశారు.

తనలాంటి వారు జగన్ వెనుక ఉంటూ చంద్రబాబును , ఆయన పార్టనర్‌ను , లోకేష్‌ను విమర్శిస్తే బూతుల మంత్రనో , భూషణం మంత్రనో అంటున్నారని , మీ ఇష్టమొచ్చినట్టుగా హెడ్డింగ్లు పెట్టుకున్నా లెక్కచేసేది లేదన్నారు.

సీఎం జగన్‌ని ఒక మాట అంటే అన్నవారిని తిరిగి పది మాటలు అంటామని నాని హెచ్చరించారు . జగన్ వెనుక ఉన్నానన్న ఆక్రోశంతో ఏబీఎన్ రాధాకృష్ణ , టీవీ 5 బీఆర్ నాయుడు , ఈనాడు రామోజీరావులు వారి ఛానల్స్‌లో ఇష్టమొచ్చినన్ని రోజులు తన గురించి వేసుకోవచ్చని , పత్రికల్లో రాసుకోవచ్చని , ఐ డోంట్ కేర్ అంటూ ఆయన తేల్చి చెప్పేశారు.