గుడివాడ: నా అనుచరులు పేకాటలో ఉండే ఏమౌతోందని ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. పేకాట ఆడితే ఉరిశిక్ష వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. పెనాల్టీ కట్టి  బయటకు వచ్చి మళ్లీ ఆడతారని ఆయన చెప్పారు.

అందుకే చట్టాల్లోనే మార్పులు తీసుకువస్తున్నామన్నారు. తాము చెబితేనే గుడివాడలో పేకాట క్లబ్ లపై పోలీసులు దాడి చేశారని ఆయన చెప్పారు. 

నేనే పేకాట క్లబ్ లు నడిపితే పోలీసులు ఎందుకు దాడి చేస్తారని ఆయన ప్రశ్నించారు. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఇంట్లో పేకాట క్లబ్ లు నిర్వహించేవాడని ఆయన ఆరోపించారు.

విజయవాడ, గుంటూరులలో కొనకళ్ల నారాయణరావు పేకాట క్లబ్బులు నడిపేవాడని ఆయన చెప్పారు. 1200 మంది బ్రోకర్లు ఆయన వద్ద పనిచేసేవారన్నారు.

పేకాట క్లబ్బుల ద్వారా వచ్చే డబ్బులను కొనకళ్లనారాయణరావు లోకేష్ కు ఇచ్చేవాడని ఆయన  చెప్పారు. కొంతమందిని చంద్రబాబునాయుడు రోడ్లపైకి వదిలేశారన్నారు.  సీఎం జగన్ ను తాను వ్యక్తిగత పనుల కోసం అభ్యర్ధించలేదని తెలిపారు.

చంద్రబాబునాయుడు అడుగుజాడల్లోనే కుట్రలు జరుగుతున్నాయని నాని ఆరోపించారు. తానేంటో గుడివాడ ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు.