ఐటీ దాడుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. రూ.2 వేల కోట్ల రూపాయలు ఎవరూ ఇంట్లో పెట్టుకుని కూర్చోరని ఆయన మండిపడ్డారు.

రెండు వేల కోట్లు అక్రమంగా సంపాదించినవే అన్న మంత్రి అంత సొమ్మును పీఏ ఇంట్లో పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు పిచ్చోడు కాదంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పిన మేరకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని పీఏ శ్రీనివాస్ తన డైరీలో రాసుకున్న విషయాన్ని నాని గుర్తుచేశారు.

Also Read:ఆ ముగ్గురికి చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టులు: షెల్ కంపెనీల గుట్టు రట్టు

చేసిన అక్రమాలకు చంద్రబాబుకు శిక్ష తప్పదని.. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయని కొడాలి నాని చెప్పారు. రెండు వేల కోట్ల నగదు దొరికిందని ఎవరూ చెప్పలేదని మంత్రి తెలిపారు.

ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన శాసనమండలి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతోందని, రాజకీయాలకు వేదికగా మారుతోందని అందుకే కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిందని కొడాలి నాని స్పష్టం చేశారు. తప్పులు చేసి ఇప్పుడు ఢిల్లీకి వస్తే లాభం లేదని, కేంద్ర పెద్దలు కూడా ఇప్పుడు వీరి మాటలు వినే అవకాశం లేదని మంత్రి తెలిపారు.

అంతకు మందు కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌ను కలిసిన నాని ఎఫ్‌సీఐ నుంచి ఏపీకి రావాల్సిన నాలుగు వేల కోట్లు ఇవ్వాల్సిందిగా కోరినట్లు వెల్లడించారు. కేంద్రం 92 లక్షల రేషన్ కార్డులను మాత్రమే గుర్తించిందని..  మొత్తం కోటి 30 లక్షల కార్డులను గుర్తించాని కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చామని నాని తెలిపారు.

అలాగే ఎఫ్‌బీఐ గోడౌన్‌లలో ధాన్యం నిల్వలను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని కోరామన్నారు. గత గైడ్‌లైన్స్‌ను సడలించి మరింత మందికి రేషన్ కార్డుల జారీ అయ్యేలా చూస్తామని నాని వెల్లడించారు.

Also Read:తప్పు చేశారు కాబట్టే: బాబు, లోకేశ్‌పై మంత్రి శ్రీరంగనాధ రాజు వ్యాఖ్యలు

ప్రత్యేకంగా ఆరోగ్య శ్రీ,, ఫీజు రీయింబర్స్‌మెంట్ కార్డులు ఇవ్వడం వల్ల తమకు రేషన్ కార్డులు అవసరం లేదని 9 లక్షల మంది కార్డులను వెనక్కి ఇచ్చేశారని కొడాని నాని తెలిపారు. 6 లక్షల కార్డులపై ఎంక్వయిరీ జరుగుతుందని.. తనిఖీ అనంతరం వాటిని అర్హులందరికీ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండాలనే లక్ష్యంతోనే నిబంధనలు సడలించామని నాని పేర్కొన్నారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఐదురోజుల్లోనే రేషన్ కార్డు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. వన్ నేషన్.. వన్ కార్డు నిర్ణయంపై కేంద్రం విధి విధానాలు రూపొందించి అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు.