గుడివాడ: చంద్రబాబు అండ్ కో బాగుపడేందుకు ఈ అమరావతిని తీసుకొచ్చారని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) ఆరోపించారు. ఏ ప్రాంతంలో రాజధాని వస్తుందో చంద్రబాబు,  లోకేష్ లు వారి సన్నిహితులకు, సహాయ సహకారాలు అందించే వ్యాపారవేత్తలతో పాటు వివిధ వ్యవస్థలకు సంబంధించిన వారికి ముందుగానే చెప్పారన్నారు. వీరంతా ఎకరం రూ. 25 లక్షలు నుండి రూ.30 లక్షల చొప్పున భూములను కొనుగోలు చేశారని... ఇలా కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు ఆనాటి సీఎం, మంత్రి సహకరించారని మంత్రి ఆరోపించారు. 

''ఈ విషయాలను అప్పటి నుండి ఇప్పటివరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చెబుతూనే వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ వేసి, ప్రాథమిక సమాచారం సేకరించి, సిట్ ను  కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత మార్చి నెలలోనే రాజధాని భూ వ్యవహారాలకు సంబంధించి సిబిఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం, సిబిఐకి దేశ వ్యాప్తంగా అనేక కేసులు ఉండటం వల్ల గాని ఆరు నెలలైనా స్పందించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే రాష్ట్ర దర్యాప్తు సంస్థను విచారణ జరపాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు'' అని తెలిపారు. 

''ఈ దర్యాప్తులో రాష్ట్ర ప్రజలు కళ్లు తిరిగే వాస్తవాలను చూశారు. రాజధాని భూముల వ్యవహారంలో అమాయకులను ఇరికించే పరిస్థితి ఉండదు. సంబంధం ఉన్న వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా  దమ్ముగా, ధైర్యంగా వారిపై కేసులు పెట్టి న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. 
ఈ విషయంలో ప్రభుత్వం, పార్టీ, రాష్ట్ర ప్రజలు జగన్ కు అండగా ఉంటారు. రాజధాని భూముల వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉంటే తప్పక చర్యలుంటాయి. చర్యలు తీసుకోవడంలో భయపడే రకం కాదు'' అని పేర్కొన్నారు. 

వీడియో

"

''చంద్రబాబు బతుకు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఎక్కడ పుట్టారు, ఎంత ఆస్తి ఉంది, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎన్టీఆర్ దగ్గర ఏ రకంగా చేరారు, తర్వాత ఆయనను ఏం చేశారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో పాలు, పెరుగు అమ్మి 20 వేల కోట్లు సంపాదించిన వాడు ఎవడైనా ఉన్నాడా. పాలు, పెరుగు పేరుతో వేల కోట్లు ఎలా సంపాదించవచ్చో తెల్సిన మాస్టర్ చంద్రబాబు. అవినీతి ఎలా చేయొచ్చు, కేసులు పెట్టకుండా ఏ రకంగా స్టేలు తెచ్చుకోవచ్చో చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు
. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టినా ఎలా స్టేలు తెచ్చుకున్నారు, వాటిని ఏ రకంగా ఆపుకుంటున్నారో రాష్ట్ర ప్రజలు చూశారు'' అని మండిపడ్డారు. 

read more   అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: దమ్మాలపాటి కేసులో హైకోర్టు స్టే

''స్టేలు, బెయిల్స్ తెచ్చుకుంటూ జైలుకు వెళ్లకుండా ఆయనకున్న పలుకుబడితో ఆపుకోవచ్చు కానీ పైనున్న దేవుడు, రాష్ట్ర ప్రజలు వీటన్నింటిని చూస్తున్నారు. ఇప్పటికే ప్రజలు చంద్రబాబుకు శిక్ష వేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే ఏంటి, ఇంట్లోనే ఒక రూమ్ లో ఉంటే ఏంటి. బాబు అనుభవించేది జైలు జీవితం కాదా. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 23 సీట్లు ఇచ్చి అధికారంలోకి రాకుండా నేలకేసి కొట్టారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు కాబట్టే ఇంకా బతికే ఉన్నారు. ఒక గదికి పరిమితమై అక్కడే బతుకుతున్నాడు. జైలు అంటే అదే కదా. కోర్టులు, ఆయనకున్న వ్యవస్థల ద్వారా తప్పించుకోవచ్చు గాని దేవుడు, రాష్ట్ర ప్రజల చేతుల్లో నుండి చంద్రబాబు తప్పించుకోలేరు. చంద్రబాబు ఇప్పటికే శిక్షలను అనుభవిస్తున్నాడు. ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వాటికి కూడా దేవుడు ఇంకా తీవ్రమైన శిక్షలు విధిస్తాడు'' అంటూ విరుచుకుపడ్డారు. 

''ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును రాష్ట్ర ప్రజలే తొలగించి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి వ్యవస్థలోనూ నలుగురు చెంచాలను పెట్టుకున్నారు. తాను చేసిన అవినీతిపై కేసుల్లో ఇస్తారనే భయంతో పెట్టుకున్న ఈ చెంచాలు చంద్రబాబును కాపాడుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రజల సొమ్మును కాజేసిన వ్యక్తిని సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల్లోంచి కూడా కాపాడుతున్నారు. దేవుడు అంతా చూస్తూనే ఉన్నారు, తప్పకుండా న్యాయమే గెలుస్తుంది. వ్యవస్థల్లో, కలుగుల్లో దాక్కున్న వారిని కూడా బయటకు తీసుకు వస్తాం. న్యాయస్థానాల్లో తాత్కాలికంగా తప్పించుకోవచ్చు గాని, ప్రజా కోర్టులో ఎవరు తప్పించుకోలేరు'' అంటూ మంత్రి నాని హెచ్చరించారు.