జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. టీడీపీ సపోర్టుతో పవన్ విశాఖలో లాంగ్‌మార్చ్ ఎందుకు చేశారో ప్రజలకు అర్ధం కాలేదని నాని వ్యాఖ్యానించారు.

వరదల్లో ఇసుక ఎలా తీస్తారో అనే టెక్నాలజీ గురించి పవన్ ఏమైనా చెప్తారని తాము ఎదురుచూశామన్నారు. జనంలో జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే లాంగ్‌మార్చ్‌కి అన్ని పార్టీలను జనాల్ని పంపమని ఎందుకు అడిగారని నాని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని కూడా సరిగా చదవలేకపోయారని.. వేదికల మీద అర్ధం లేకుండా పూనకం వచ్చినట్లు ఊగిపోతూ మాట్లాడితే జనం అసహ్యించుకుంటారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Also Read:వంగోబెట్టారు, పడుకోబెట్టారు తాట కూడా తీశారు : పవన్ కు అంబటి కౌంటర్

కన్నబాబుని నాగబాబు గెలిపించారని అంటున్నారు.. మరి అదే నిజమైతే నాగబాబు ఎందుకు ఓడిపోయారు..? మీ అన్నని పవన్ ఎందుకు గెలిపించలేకపోయారని నాని ప్రశ్నించారు. ప్రజలు జనసేనానిని నమ్మడం లేదని గుర్తించాలని... జనం మీతో ఉంటే మీరు రెండు చోట్లా ఎందుకు ఓడిపోయారని మంత్రి నిలదీశారు.

శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నది ఇసుకను మింగేసి అచ్చెన్నాయుడు బాగా లావెక్కారని... అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో రంగురాళ్లను దోచేశారని ఇలాంటి వారిని పక్కనబెట్టుకుని పవన్ కల్యాణ్ తమకు నీతులు చెప్తారా అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుది శాడిస్ట్ పాలన కాబట్టే జనం ఓడించారని మంత్రి విమర్శించారు. 

ఇసుక పాలసీలో తప్పులుంటే సరిచేయాలని.. 151 సీట్లతో వచ్చిన బలమైన ప్రభుత్వమని మళ్లీ ఆ స్థాయిలో సీట్లు ఎవరికైనా వస్తాయన్న నమ్మకం తనకు లేదన్నారు. భవన నిర్మాణ కార్మికులను వైసీపీ ప్రభుత్వం రోడ్డున పడేసిందని.. వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు తీసుకునే హక్కు లేదని పవన్ విమర్శించారు.

తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని సూట్‌కేసు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి కూడా తనను విమర్శిస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. రెండున్నరేళ్లు వీళ్లు జైలులో ఉన్నారని..సూట్‌కేసు కంపెనీలు పెట్టి జైలుకెళ్లారని, పరిధి దాటితే తాట తీసి కింద కూర్చోబెడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. 

Also Read:ఐలవ్ మెగాస్టార్, పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నవారే... : రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

ఏ డీఎన్‌ఏ ఉందని విజయసాయి తనను పెళ్లికి పిలిచారని పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి తాను రెండు వారాలు గడువిస్తున్నానని.. చనిపోయిన కార్మికులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని జనసేనాని డిమాండ్ చేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.

ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లో నేనే నడుస్తానని..చంద్రబాబుపై ఉన్న కోపాన్ని కార్మికులపై చూపొద్దని పవన్ హితవు పలికారు. తనను విమర్శించేందుకు కన్నబాబుకు ఉన్న అర్హతేంటన్న పవన్ కల్యాణ్.. కన్నబాబు బతుకు తమకు తెలియనిది కాదని ధ్వజమెత్తారు.