Asianet News TeluguAsianet News Telugu

వంగోబెట్టారు, పడుకోబెట్టారు తాట కూడా తీశారు : పవన్ కు అంబటి కౌంటర్

విశాఖపట్నం సభలో పవన్ కళ్యాణ్ సొంతంగా మాట్లాడారా లేక టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ లు చదివారా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ స్క్రిప్ట్ చదివారు కాబట్టే చంద్రబాబుని విమర్శించలేదన్నారు.  

ysrcp mla ambati rambabu comments on janasena chief pawan kalyan
Author
Tadepalli, First Published Nov 4, 2019, 10:52 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, మంత్రి కన్నబాబుపై పవన్ కళ్యాణ్ చేసిన  వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. 

విశాఖపట్నం వేదికగా పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి టైములిచ్చి, బెదిరించే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.15 రోజుల్లో ఇసుక కొరత నివారించకపోతే అమరావతిలో నడుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతిలో పవన్ కళ్యాణ్ నడవొచ్చని ఎవరు అభ్యంతరం తెలపడం లేదన్నారు. 

కృష్ణానది కరకట్టన నడిచి మీ మిత్రుడు, రాజకీయ మిత్రుడు చంద్రబాబు నాయుడు అక్రమంగా నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను ఖాళీ చేయమని సలహా ఇవ్వండన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలు గానీ, అవినీతిపై గానీ పవన్ కళ్యాణ్ స్పందించరని మండిపడ్డారు అంబటి రాంబాబు. 

మాట్లాడితే తాట తీస్తానని పవన్ అంటున్నారని గతంలో కూడా నాలుక కోస్తానని హెచ్చరించిన విషయాలను కూడా గుర్తు చేశారు. తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ రెండు సార్లు పోటీ చేస్తే ప్రజలు తాట తీశారంటూ సెటైర్లు వేశారు. మూలన కూర్చోబెడతానంటున్న పవన్ కళ్యాణ్ ఆయనను ప్రజలు వంగోబెట్టారు, తాట తీశారు, పడుకోబెట్టారు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నారు. 

రాజకీయాల్లో తాట తీస్తానని పదేపదే పవన్ అనడంపై మండిపడ్డారు. తాట తీయడం అంటే ఆర్నెళ్లకోసారి గెడ్డం గీసినట్లు కాదని మండిపడ్డారు అంబటి రాంబాబు. రాజకీయంగా తాట తీస్తామని హెచ్చరిస్తే తీయించుకోవడానికి వైసీపీతోపాటు ఏ పార్టీ సిద్ధంగా లేదని హెచ్చరించారు. 

తన నోరు పెద్దదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారని ఆయన కంటే వెయ్యిరెట్లు నోరు తమది పెద్దదని చెప్పుకొచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. మాట్లాడితే తాట తీస్తామంటే ప్రజలే తాట తీస్తారని హెచ్చరించారు. తర్వాత తాడిచాప చేస్తారనే విషయాన్ని మరచిపోవద్దన్నారు. 

రాజకీయాల్లో విమర్శలు చేయవచ్చు అందులో తప్పలేదన్నారు. సద్విమర్శలు చేయవచ్చు గానీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రమంత్రి కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వ్యవసాయ శాఖ మంత్రిగా కన్నబాబు రాష్ట్రానికి సేవ చేస్తున్నారని ఆయనపై విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. గత ఎన్నికల్లో కన్నబాబును ఓడించండి ఓడించండి అంటూ పదేపదే పిలుపు ఇస్తే అక్కడి ప్రజలు కన్నబాబును గెలిపించి మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడించారని అది తెలుసుకోవాలన్నారు. 

కురసాల కన్నబాబును రాజకీయాల్లోకి తీసుకు వచ్చిందే తాము అని పదేపదే చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మంత్రి అన్న విషయాన్ని మరచిపోయారన్నారు. ప్రజారాజ్యంలో చిరంజీవి అనేకమందికి టికెట్లు ఇచ్చారని అయితే కేవలం 18 మందే గెలిచారని అలాంటి వారిలో కన్నబాబు ఒకరన్నారు. 

ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్న కన్నబాబుపై నీ కథంతా తెలుసు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంపై మండిపడ్డారు. నీకేం తెలుసు కథ అంతా అంటూ ప్రశ్నించారు. అది మీ సంస్కృతికి మంచిది కాదన్నారు. 

రెండున్నర సంవత్సరాలు జైలుకెళ్లిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని తనను విమర్శించే హక్కు ఆయనకు లేదంటూ పవన్ కళ్యాణ్ అనడంపై అంబటి రాంబాబు మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి అని అంటారా అంటూ విరుచుకుపడ్డారు. 

విశాఖపట్నం సభలో పవన్ కళ్యాణ్ సొంతంగా మాట్లాడారా లేక టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ లు చదివారా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ స్క్రిప్ట్ చదివారు కాబట్టే చంద్రబాబుని విమర్శించలేదన్నారు.  

వైయస్ జగన్ నేరారోపణ చేయబడ్డ వ్యక్తి అని అంబటి స్పష్టం చేశారు. జగన్ 18 నెలలు జైల్లో ఉన్నారని, ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్తారని ప్రజలకు తెలుసునన్నారు. అవన్నీ తెలిసే ప్రజలు 151 సీట్లు ఇచ్చి గెలుపొందారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 

సీఎం జగన్ పై అక్రమంగా కేసులు పెట్టారని, వైసీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నీ గ్రహించే ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తుకు తెచ్చారు. ఇప్పుడేదో కొత్తగా మీరు కనిపెట్టినవి ఏమీ కాదన్నారు. 151 సీట్లు ఇచ్చి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ లు చదువుతూ, వారి చేసిన ఆరోపణలనే చేస్తున్న పవను్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల్లో అభాసుపాలవుతున్నారని ఆ విషయాన్ని గమనించాలని అంబటి రాంబాబు హితవు పలికారు.  

ఈ వార్తలు కూడా చదవండి

హద్దు మీరితే తాట తీస్తా.. కన్నబాబు, విజయసాయిలకు పవన్ వార్నింగ్

Follow Us:
Download App:
  • android
  • ios