టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన ఉసురు ఆయనను వెంటాడుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికైనా ఉచితంగా ఇసుక ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. గాదె కింద పందికొక్కుల్లాగా మేసేశారని.. ఇసుక అక్రమ రవాణాను తహసీల్దార్ వనజాక్షి అడ్డుకున్నారని మంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలో చింతమనేని ప్రభాకర్ ఆమె జుట్టు పట్టుకుని లాగారని కారుమూరి ఆరోపించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా పాలసీ రూపొందించామని నాగేశ్వరరావు చెప్పారు. తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. 

చంద్రబాబుకు ఐటీ నోటీసులపై మంత్రి కారుమూరి స్పందించారు. ఆయన నీతి కబుర్లు చెబుతూ వుంటాడని.. కానీ ఐటీ నోటీసులపై ఇంత వరకు చంద్రబాబు ఎందుకు స్పందించలేదని కారుమూరి ప్రశ్నించారు. ఆయన జీవితమంతా స్టేలు తెచ్చుకోవడమేనని.. సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. నోటీసుల నేపథ్యంలో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని.. ఎన్టీఆర్ మరణానికి కారణమైన ఉసురు ఆయనను వెంటాడుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. పార్టీ లేదు బొక్కా లేదు అన్నది అచ్చెన్నాయుడు మనసులోని మాట అన్నారు. 

Also Read: చంద్రబాబు అవినీతి తేటతెల్లం అయ్యింది.. ఏం సమాధానం చెబుతారు?: సజ్జల

అంతకుముందు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయని.. దీనిపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడ్డారో తేటతెల్లం అయ్యిందని అన్నారు. ‘2020లో ఒకసారి, 2021లో ఇంకోసారి ఐటీ దాడులు జరిగాయి. మనోజ్ దేవ్, శ్రీనివాస్ ఇళ్లలో తనిఖీలు ఐటీ చేసింది. 

ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీల ద్వారా షెల్ కంపెనీలకు వెళ్లి, అక్కడ నుంచి చంద్రబాబుకు నిధులు అందాయని ఐటీ చెప్పింది. నోటీసులో కూడా ఐటీ శాఖ ఇదే చెప్పింది. దీనిపై చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు మాట్లాడటం లేదు?. నోటీసులపై సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ ఐదారు సార్లు చంద్రబాబు సమాధానం చెప్తూ వచ్చారు. అయితే ఆ సమాధానాలేవీ నిలబడవు’’ అని సజ్జల అన్నారు. 

ఇన్నేళ్ల చంద్రబాబు రాజకీయం అంతా ఇలాగే సాగుతూ వచ్చిందని సజ్జల విమర్శించారు. చంద్రబాబుకు కిట్ బ్యాగ్స్ అందాయని పూర్తి సమాచారం ఉన్నందునే ఐటీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కొన్ని తరాలపాటు లాభం పొందేలా చంద్రబాబు స్కాం చేశారని ఆరోపించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం మాదిరి వాడుకున్నారని ప్రధాని మోదీనే స్వయంగా చెప్పారని అన్నారు. చంద్రబాబు ప్రతి పనిలోనూ అడ్డగోలుగా ముడుపులు అందుకున్నారని ఆరోపించారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయం భవనాలు, టిడ్కో ఇళ్ళు ఇలా ప్రతిపనిలోనూ చంద్రబాబు, ఆయన ముఠా లబ్ది పొందిందని ఆరోపణలు చేశారు.