Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అవినీతి తేటతెల్లం అయ్యింది.. ఏం సమాధానం చెబుతారు?: సజ్జల

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడ్డారో తేటతెల్లం అయ్యిందని అన్నారు.

sajjala ramakrishna reddy Slams Chandrababu Naidu Over IT Notice ksm
Author
First Published Sep 2, 2023, 2:13 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయని.. దీనిపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదని  ప్రశ్నించారు. చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడ్డారో తేటతెల్లం అయ్యిందని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ మీడియాలో వచ్చిన  కథనాలపై చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

‘‘2020లో ఒకసారి, 2021లో ఇంకోసారి ఐటీ దాడులు జరిగాయి. మనోజ్ దేవ్, శ్రీనివాస్ ఇళ్లలో తనిఖీలు ఐటీ చేసింది. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీల ద్వారా షెల్ కంపెనీలకు వెళ్లి, అక్కడ నుంచి చంద్రబాబుకు నిధులు అందాయని ఐటీ చెప్పింది. నోటీసులో కూడా ఐటీ శాఖ ఇదే చెప్పింది. దీనిపై చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు మాట్లాడటం లేదు?. నోటీసులపై సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ ఐదారు సార్లు చంద్రబాబు సమాధానం చెప్తూ వచ్చారు. అయితే ఆ సమాధానాలేవీ నిలబడవు’’ అని సజ్జల అన్నారు. 

ఇన్నేళ్ల చంద్రబాబు రాజకీయం అంతా ఇలాగే సాగుతూ వచ్చిందని సజ్జల విమర్శించారు. చంద్రబాబుకు కిట్ బ్యాగ్స్ అందాయని పూర్తి సమాచారం ఉన్నందునే ఐటీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కొన్ని తరాలపాటు లాభం పొందేలా చంద్రబాబు స్కాం చేశారని ఆరోపించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం మాదిరి వాడుకున్నారని  ప్రధాని మోదీనే  స్వయంగా చెప్పారని అన్నారు. చంద్రబాబు ప్రతి పనిలోనూ అడ్డగోలుగా ముడుపులు అందుకున్నారని ఆరోపించారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయం భవనాలు, టిడ్కో ఇళ్ళు ఇలా ప్రతిపనిలోనూ చంద్రబాబు, ఆయన ముఠా లబ్ది పొందిందని ఆరోపణలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios