చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాల వల్లే 2019లో అధికంగా అన్నదాతల ఆత్మహత్యలు అధికమయ్యాయని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు
 ఆరోపించారు. 2019లో తొలి 5 నెలలు పాలించింది చంద్రబాబేనని... ఆ మాత్రం జ్ఞానం లేకుండా విమర్శలు చేయడం తగదన్నారు. తమ ప్రభుత్వం రైతు ఆత్మహత్యలు లేని ఏపీని తయారు చేయాలని అనుకుంటోందని... రైతు కంట కన్నీరు కనపడకూడదన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రైతులను ఆదుకోవడంలో వైయస్సార్ ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్ నాలుగు అడుగులు ముందుకు వేశాడని కన్నబాబు కొనియాడారు. 

''రాష్ట్రంలో 2019లో జరిగిన రైతు ఆత్మహత్యలపై తెలుగుదేశం ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తోంది. గత ఏడాది జూన్‌ నెల నుంచి వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంను చేపట్టింది. అంతకు ముందు ఆరునెలల పాటు చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం వుంది. గడిచిన అయిదేళ్ల చంద్రబాబు పాలనలో రైతుల పట్ల అనుసరించిన నిర్లక్ష్య వైఖరి వల్లే 2019లో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఈ విషయాన్ని దాచిపెట్టి టిడిపి నాయకులు ఎన్‌సిఆర్‌బి నివేదికను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వంపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు'' అని అన్నారు. 

''ఎన్‌సిఆర్‌బి లెక్కలను చూపుతూ 2019లో జనవరి నుంచి డిసెంబర్ వరకు రైతుకూలీలతో సహా 1029 మంది ఆత్మహత్య చేసుకుంటే, దానిలో 628 మంది రైతులు వున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇందులో ఆరునెలల పాలన చంద్రబాబు హయాంలోనే కొనసాగిందనే విషయాన్ని టిడిపి నేతలు మరిచిపోయారా? మీరు చేసిన పాపం కాదా ఇది? మీ రైతు వ్యతిరేక పాలన పర్యవసానమే గత ఏడాది రైతు ఆత్మహత్యలు పెరగడానికి కారణం. చంద్రబాబు రైతు వ్యతిరేక పాలన పర్యవసానమే రైతులు అథోగతి పాలయ్యేందుకు కారణమైంది. దానిని సరిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది'' అని పేర్కొన్నారు. 

''చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ, రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ఏడాది రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 2020లో ఇప్పటి వరకు పోలీస్ ఎఫ్‌ఐఆర్‌ లో నమోదైన రైతు ఆత్మహత్యలు 157 కేసులు అయితే.. వీటిలో త్రిసభ్య కమిటీ విచారణ చేసి నిర్థారించినవి 33 కేసులు. అంటే మా పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి లేకుండా మేం నిర్ణయాలు తీసుకుంటున్నామని ఈ లెక్కలే చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలే లేకుండా వుండాలనే ధృడసంకల్పంతో అనేక పథకాలను రైతుల కోసం అమలు చేస్తున్నాం'' అని తెలిపారు.

read more   సత్ఫలితాలనిస్తున్న మనం- మన పరిశుభ్రత కార్యక్రమం: జాతీయ స్థాయిలో ప్రశంసలు 

''చంద్రబాబు పాలనలో 2014-19 వరకు ఎన్‌సిఆర్‌బీ రికార్డుల్లో నమోదైన రైతు ఆత్మహత్యల్లో టిడిపి ప్రభుత్వం తిరస్కరించిన 769 కేసులను కూడా మరోసారి విచారించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిలో 393 మంది రైతు ఆత్మహత్యలను నిర్దారించడంతో వారికి కూడా రూ.19.65 కోట్లు నష్ట పరిహారంగా చెల్లించాం. ఇదీ రైతుల పట్ల జగన్కి వున్న చిత్తశుద్ది. చంద్రబాబుకు రైతులంటే ప్రేమలేక పోగా, రాజకీయం కోసం మొసలికన్నీరు కార్చడం అలవాటు'' అని మండిపడ్డారు. 

''రైతులకు జగన్‌ వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబు, ఆయన అనుయాయులు పిచ్చిపిచ్చిమాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబుకే వెన్నుపోటు పేటెండ్ వుంది. జగన్ గారికి సాయం చేయడం, ఆదుకోవడం, కష్టంలో వున్న వారిని చూసి చలించడమే తెలుసు. క్యూలైన్ల్లో విత్తనాల కోసం వేచివుండి గుండెపోటుతో రైతులు చనిపోతున్నారని అనడానికి చంద్రబాబుకు సిగ్గులేదా? రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలోనే విత్తనాలు అందిస్తున్నాం. మీ హయాంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్లలో వున్న మాట వాస్తవం. ఇప్పుడు ఆ అవసరమే లేదు. గ్రామస్తాయిలోనే రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతు ముంగిట్లోకే విత్తనాలు అందిస్తున్నాం'' అని వెల్లడించారు. 

''రైతుభరోసాపై తెలుగుదేశం నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రైతుల సంఖ్యను తగ్గిస్తున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మొదటి సంవత్సరం మొత్తం 46 లక్షల రైతులకు రూ.6534 కోట్లు పెట్టుబడి సాయంగా అందించాం. 2020-21 లో 49.45 లక్షల కుటుంబాలకు కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా.. ఎటువంటి ఇబ్బంది రాకూడదనే సంకల్పంతో మే 15వ తేదీన మొదటి విడత పెట్టుబడి సాయంను అందించాం.  వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేరుగా రైతులకు అందించిన పెట్టబడి సాయం మొత్తం రూ.10,200 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే రైతుల సంఖ్య తగ్గిందా? పెరిగిందా? టిడిపి నేతలే సమాధానం చెప్పాలి. గ్రామ సచివాలయాల్లో అర్హులైన రైతుల జాబితాలను నేరుగా  టిడిపి నేతలు వెళ్ళి పరిశీలించుకోవచ్చు. సున్నావడ్డీ బకాయిలు ఉండిపోయాయంటూ మరో తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ జయంతి రోజున రూ.1100 కోట్లు రైతుల ఖాతాలకు సున్నా వడ్డీ కింద జమ చేశాం. ఆఖరికి చంద్రబాబు చెరకు రైతులకు పెట్టిన బకాయిలను కూడా మేం తీర్చాం'' అన్నారు. 

''గత ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురిశాయి. అన్ని రిజర్వాయర్లు నిండాయి. మొత్తం 182 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు సాధించాం. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం 1,24,48490 ఎకరాలు అయితే ఇప్పటి వరకు 91,99,983 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. విజయనగరం జిల్లాలో కొద్దిగా నాట్లు తక్కువగా పడ్డాయి. ఈ నెల 15వ తేదీ వరకు చూసి, నాట్లు వేయని భూమి కోసం కంటింజెన్సీ ప్లాన్‌ కూడా సిద్దం చేస్తున్నాం. నీరు లేని చోట్ల, కాలువ శివారు భూముల్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నాం. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళిక కూడా ప్రకటింబోతోంది'' అని తెలిపారు. 

''రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రాప్ బుకింగ్ 78 శాతం పూర్తయ్యింది. ఈనెల పదో తేదీ నాటికి నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పంట రుణాలుకూడా ఎక్కువగా ఇచ్చాం. గత ఏడాది ఇదే సమయానికి రూ.26,636 కోట్లు ఇస్తే, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 41,241 కోట్లు ఇచ్చాం.

''సహకార రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 730 సహకార సంఘాలు నష్టాల్లో ఉన్నాయి. వాటిని లాభాల్లోకి తీసుకురావడానికి ప్రతి డిసిసిబిలోనూ ఫ్యాక్స్ డెవలప్‌మెంట్ సెల్‌ ను ఏర్పాటు చేస్తున్నాం. దానికి నిపుణులైన అధికారులను నియమిస్తున్నాం. అలాగే రాష్ట్ర స్థాయిలో ఆప్కాబ్‌ నేతృత్వంలో ఒక అధికారికి బాధ్యతలు ఇస్తున్నాం. రాష్ట్రంలో రెండు మినహా మిగిలిన డిసిఎంఎస్‌లు లాభాల్లో వున్నాయి. నష్టాల్లో వున్న వాటిని కూడా లాభాల్లోకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తున్నాం'' అన్నారు. 

''వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల కోసం ప్రతి గ్రామంలోనూ ఒక గోదామును, ప్రతి మండలంలోనూ ఒక కోల్‌డ్ స్టోరేజీ ఏర్పాటు చేయబోతున్నాం. దీనిపై త్వరలోనే సమగ్ర ప్రణాళికను ప్రకటించబోతున్నాం'' అని మంత్రి వెల్లడించారు.