కోవిడ్ మరణాలపై ప్రతిపక్షనేత చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు మంత్రి కురసాల కన్నబాబు. ఆదివారం కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి 10 సెకన్లకు ఒకరు చనిపోతున్నారని చంద్రబాబు ఎలా చెబుతున్నారని కన్నబాబు ప్రశ్నించారు.

తన అబద్ధాలతో ప్రతిపక్షనేత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తారా..? అని ఆయన నిలదీశారు. వాస్తవాలను తెలుసుకోకుండా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు.

బాధ్యతగల ప్రతిపక్షనేత ఇలా తప్పుడు లెక్కలతో ప్రజలను భయపెట్టవచ్చా అని మంత్రి అన్నారు. టీడీపీ అధినేత విజ్ఞత కోల్పోయి.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Also Read:వణుకుతున్న ఏపీ: కొత్తగా 7,627 మందికి పాజిటివ్.. 56 మరణాలు, 96 వేలు దాటిన కేసులు

కోవిడ్‌తో ప్రజలు అల్లాడుతుంటే.. చంద్రబాబు ముఖంలో ఆనందం కనిపిస్తోందని కన్నబాబు చెప్పారు. కోవిడ్ మరణాలపై అసత్యాలు చెబుతూ ఈ ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రతిరోజూ కరోనాకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్రప్రభుత్వం అత్యంత పారదర్శకంగా మెడికల్ బులిటెన్‌ రూపంలో ప్రజలకు వెల్లడిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ పై ముఖ్యమంత్రి జగన్ అధికారులుతో సమీక్షలు జరుపుతూ, ఎప్పటికప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల భరోసా ఇస్తున్నారని ఆయన తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా చివరికి హోం ఐసోలేషన్ లో వున్న వారికి కూడా కరోనా కిట్లు అందిస్తున్నామని కన్నబాబు చెప్పారు. చంద్రబాబు లెక్క ప్రకారం పది సెకన్లకు ఒకరు చొప్పున రోజుకు ఎన్ని వేల మంది చనిపోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. తనకు అనుకూలమైన మీడియా వుందని, ఏది మాట్లాడినా ప్రసారం చేస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కన్నబాబు విమర్శించారు