కరోనా వైరస్‌తో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,627 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. ప్రస్తుతం  రాష్ట్రంలో 48,956 యాక్టివ్ కేసులు ఉండగా.. 46,301 మంది డిశ్చార్జ్ అయ్యారు.  

24 గంటల్లో కోవిడ్ కారణంగా 56 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,041కి చేరుకుంది. 24 గంటల్లో 47,645 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో రాష్ట్రంలో మొత్తం పరీక్షల సంఖ్య 16,43,319కి చేరింది.

ఇవాళ అత్యథికంగా కర్నూలు జిల్లాలో 1,213 కేసులు వెలుగు చూడగా ఆ తర్వాత తూర్పు గోదావరి 1,095, పశ్చిమ గోదావరి 859, విశాఖపట్నం 784, గుంటూరు 547, కడపలో 396 మందికి పాజిటివ్‌గా తేలింది. కేసులతో పాటు మరణాల్లో కూడా తూర్పు గోదావరి జిల్లా ఇవాళ అగ్రస్థానంలో ఉంది.

ఆదివారం కరోనా కారణంగా అక్కడ 9 మంది మరణించగా, ఆ తర్వాత విశాఖలో 8, కర్నూలులో 6, కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలలో ఐదుగురు చొప్పున, విజయనగరం 3, అనంతపరం, కడపలలో ఇద్దరు  చొప్పున, గుంటూరు, ప్రకాశంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.