తాడేపల్లి: అధికారం రాలేదని ప్రజలపై చంద్రబాబు కక్షసాధిస్తున్నారని ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా అప్రాప్రియేషన్‌ బిల్లు ఆమోదం కాకుండా అడ్డుకున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనివల్ల ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేకపోయామన్న ఆయన... కేవలం ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.  చంద్రబాబు ప్రజలకు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

కేవలం బిల్లులను అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ సభలో వ్యవహరించిందని, బిల్లును ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీ అడ్డుకుందన్నారు. బిల్లును అడ్డుకున్న విషయంలో దురుద్ధేశ్యాలు లేకుంటే చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెపితే సీనియార్టీ కాపాడుకున్నవారవుతారని అన్నారు.  ఎక్కువ కాలం సీఎం, ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు, ఉద్యోగుల జీతాలను అడ్డుకున్న చరిత్ర కూడా సృష్టించారన్నారు. 

ఇవాళ పేదల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంది కాబట్టే పించన్లు ఇవ్వగలిగామన్న మంత్రి కన్నబాబు చాలా కీలకమైన అంశాలని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్‌ కల్లాం తో కలిసి మీడియా ముందుకు వచ్చామన్నారు. ఆయన అనుకున్నట్టుగా అధికారం కట్టబట్టలేదని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలని కక్ష సాధిస్తున్న తీరు కొద్ది రోజుల నుంచి చూస్తా ఉన్నామని, దానికి నిదర్శనమే అప్రాప్రియేషన్‌ బిల్లుని కౌన్సిల్‌లో పాస్‌ కాకుండా అడ్డుకోవడమని తేల్చి చెప్పారు.  

read more   ఇంకా కక్ష తీరలేదా.. అచ్చెన్నాయుడు డిశ్చార్జిని ఖండించిన చంద్రబాబు

ఈ రాష్ట్ర చరిత్రలో గడిచిన 50 సంవత్సరాల్లో తీసుకుంటే కౌన్సిల్‌లో ఎప్పుడూ కూడా ఈ రకంగా  బడ్జెట్‌ను పాస్‌ కాకుండా అడ్డుకున్న చరిత్ర ఎప్పుడూ లేదని, తొలిసారి అలాంటి తన మార్కు చరిత్రని, తన మార్కు టార్గెట్‌ని నమోదు చేసుకున్న ఘనత చంద్రబాబు నాయుడుగారికే దక్కిందన్నారు.  కనీసం ప్రజలేమైపోతారు, ఉద్యోగులేమైపోతారు, ఈ విధంగా అప్రాప్రియేషన్‌ బిల్లును అడ్డుకుంటే రేపు జీతాలివ్వలేని పరిస్ధితి వస్తుంది. అత్యవసర ఖర్చు కూడా చేయలేని పరిస్ధితి వస్తే, దీనికి ఎవరకు జవాబుదారీ అని కూడా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు తన కుటిల రాజకీయ అవసరం కోసం ప్రజల మీద ఈ కక్ష సాధింపు చర్య చేశారని మండిపడ్డారు. దానివల్ల మొట్టమొదటి సారిగా ఈ నెల సకాలంలో జీతాలివ్వలేని పరిస్ధితి వచ్చిందన్నారు. 

''ఈ కక్షసాధింపు ధోరణి చంద్రబాబు నాయుడికి ఈ ప్రజల మీద కానీ, ఈ ఉద్యోగస్ధుల మీద కానీ ఏర్పడింది. దీనికి ఒక్కటే కారణం ఆయన ఓటమిని ఈనాటికీ కూడా జీర్ణించుకోలేకపోవడమే.  తనకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ ప్రగతికి కానీ, అభివృద్ధికి కాని అడ్డుకట్టు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షనాయకుడిగా ఉన్న యనమల రామకృష్ణుడు ఇదే విషయం చెప్పారన్నారు. మీకు ఆ సభలో బలముంది కాబట్టి మీరు ఏ బిల్లులు పాస్‌ చేసినా ఇక్కడ మాకు బలముంది కాబట్టి ఆపేయడానికి సిద్ధమయ్యారే తప్ప మంచీ, చెడు అందులో  ఉన్న సాంప్రదాయాలేంటి వీటినేవిధంగా గౌరవించాలని వీళ్లు ఆలోచించలేదు'' అని మండిపడ్డారు. 

 ఇవాళ చేసినదంతా చెప్పకపోతే తిరిగి జగన్మోహన్‌ రెడ్డి మీదే జీతాలివ్వలేదని బురద జల్లి తనకు కావాల్సిన ప్రచారం చేసుకునేంత నేర్పరితనం చంద్రబాబుకు ఉందన్నారు. ఈ చంద్రబాబు రాజకీయానికి ప్రచారం ఒక గిఫ్ట్‌ అని... ఏ రకమైన ప్రచారమైనా చేసుకుని తిమ్మిని బమ్మిని చేయగలరన్నారు. కౌన్సిల్‌లో వారు అడ్డుకోవడం వలనే ఈ రోజున ఉద్యోగులకు జీతాలు కానీ అంగన్వాడీస్‌ లాంటి చిన్న, చిన్న కార్యకర్తల్లాంటి వారికి వేతనాలు, గౌరవ భృతి ఇవ్వలేని పరిస్ధితి ఏర్పడిందన్నారు. మీరు బిల్లుని అడ్డుకుని, ఇవాళ జీతాలు ఆలస్యం కావడానికి, అత్యవసర ఖర్చులు పెట్టడానికి వీలు కాకుండా చేసిందానికి మీరే కారణమన్నారు.  ఈ రాష్ట్ర ప్రజలకి, ఉద్యోగులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్‌ చేశారు.