నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలోని ఎంఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ శనివారం ఆరుగురు రోగులు మరణించిన నేపథ్యంలో ఆదివారం మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి హాస్పిటల్‌ను పరిశీలించారు. వైద్య చికిత్సలో ఎలాంటి లోపం లేదని మంత్రి స్పష్టం చేశారు. 

నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలోని ఎంఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ శనివారం ఆరుగురు రోగులు మరణించిన వ్యవహారం ఏపీలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంత్రి కాకాణి గోవర్ధణ్ రెడ్డి స్పందించారు. ఆదివారం అధికారులతో కలిసి జీజీహెచ్‌ను సందర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించామన్నారు. చికిత్సలో ఎలాంటి లోపం లేదని.. ఆక్సిజన్ సరఫరా లోపం వల్ల ఆరుగురు చనిపోయారంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశారని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 

ఎంఐసీయూ వార్డులో 27 మంది చికిత్స పొందుతున్నారని.. లిక్విడ్ ఆక్సిజన్ సైతం సమృద్ధిగా వుందని ఆయన తెలిపారు. మరణించిన వారిలో ఏ ఒక్కరూ వెంటిలేటర్‌పై లేరని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , ప్రభుత్వం, వ్యవస్థలపై దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, తమ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా పంటల బీమా, పట్టాల పంపిణీ, ఇన్‌పుట్ సబ్సిడీ విధానం ద్వారా అండగా వుంటున్నామని కాకాణి తెలిపారు. 

ALso Read: నెల్లూరు జీజీహెచ్‌లో ఒకే రోజు ఆరుగురు మృతి.. డీఎంహెచ్‌వో స్పందన ఇదే

మరోవైపు.. నిన్నటి ఘటనపై డీఎంహెచ్‌వో డాక్టర్ పెంచలయ్య విచారణ చేపట్టారు.దీనిలో భాగంగా రోగుల కేస్ షీట్లు, రికార్డులను పరిశీలించారు. అనారోగ్యం కారణంగా రోగులు చనిపోయారని.. వైద్యుల నిర్లక్ష్యం వున్నట్లుగా వస్తున్న వార్తలను డాక్టర్ పెంచలయ్య ఖండించారు. ఈ ఘటనపై త్వరలోనే జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.