టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై మండిపడ్డారు మంత్రి జోగి రమేష్ . అవినీతిలో చంద్రబాబు కాకలు తీరిన మేధావి అని ఆయన వ్యాఖ్యానించారు . వారి అవినీతి మీద, ఆస్తుల మీద దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలని చంద్రబాబు, లోకేష్‌లకు జోగి రమేష్ సవాల్ విసిరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మామకు ఒక్క పోటు పొడిచేసి అధికారం లాక్కోవడంలో మీ నాన్న సిద్ధహస్తుడు అంటూ లోకేష్‌కు చురకలంటించారు. రూ.17 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు.. చంద్రబాబు ఖచ్చితంగా రూ.1.70 లక్షల కోట్లయినా కొట్టేసి వుంటాడని జోగి రమేష్ ఆరోపించారు. అవినీతిలో చంద్రబాబు కాకలు తీరిన మేధావి అని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు రాజకీయాల్లోనూ వ్యాపారం చేశారని.. ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా పనిచేసి ఆస్తులు పెంచుకున్నారని జోగి రమేష్ ఆరోపించారు. లక్షల కోట్లు దోచేసి మా నాన్న ఎలాంటి అవినీతి చేయలేదు, నేను ఏం చేయలేదంటూ చెబుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. వారి అవినీతి మీద, ఆస్తుల మీద దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలని చంద్రబాబు, లోకేష్‌లకు జోగి రమేష్ సవాల్ విసిరారు.
అంతకుముందు నారా లోకేష్ మాట్లాడుతూ.. దసరా పండగపూట కూడా ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చాడు . ఇటీవల గాంధీ జయంతి రోజున సత్యమేవ జయతే పేరిట ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టినట్లు దసరా పండగ పూట కూడా నిరసనలు సిద్దమవుతోంది టిడిపి. దసరా రోజున రావణదహనం చేయడం సాంప్రదాయం... కానీ ఈసారి జగనాసుర దహనం కూడా చేయాలని టిడిపి నిర్ణయించింది. ''దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దాం జగనాసుర దహనం'' పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
దసరా పండగరోజున అంటే అక్టోబర్ 23న రాత్రి 7 గంటల నుండి 7.05 నిమిషాల వరకు టిడిపి శ్రేణులు వీధుల్లోకి రావాలని లోకేష్ సూచించారు. 'సైకో పోవాలి' అన్ని నినాదాలు రాసిన పత్రాలను చేతబట్టి వైఎస్ జగన్, వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలని సూచించారు. అనంతరం ఆ పత్రాలను దహనం చేయాలన్నారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయాలని లోకేష్ సూచించారు.
జగన్ అనే రాక్షసుడు చెడుకు సూచికగా వుంటే... చంద్రబాబు నాయుడు మంచికి సూచికగా వున్నారన్నారు. కాబట్టి తాత్కలికంగా చెడుదే ఆధిక్యంగా కనిపించినా చివరకు గెలిచేది మంచేనని... ఇదే దసరా పండగ సందేశమని లోకేష్ అన్నారు. కాబట్టి జగన్ పై కూడా చంద్రబాబు విజయం సాధిస్తుందని... ముందుగానే పండగని సెలబ్రేట్ చేసుకుందామని నారా లోకేష్ అన్నారు.
