పవన్‌కు రాజకీయాలు తెలియవు .. ఏం చేసినా టీడీపీ కోసమే , జగన్‌ను ఓడించడం ఎవరి వల్లా కాదు : అంబటి రాంబాబు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. మా కులపోడు సీఎం కావాలని కాపులు ఆశపడుతున్నారని.. కానీ తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కానని స్వయంగా పవనే చెప్పాడని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు రాజకీయాలు తెలియవని, ఆయన చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. మా లీడర్ ముఖ్యమంత్రి కావాలని జనసేన శ్రేణులు.. మా కులపోడు సీఎం కావాలని కాపులు ఆశపడుతున్నారని.. కానీ తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కానని స్వయంగా పవనే చెప్పాడని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
టీడీపీ కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నారని.. వైసీపీని, సీఎం జగన్‌ను ఓడించడం ఎవరి వల్లా కాదని అంబటి దుయ్యబట్టారు. టీడీపీ, జనసేన కలిసొచ్చినా.. మరో ఇద్దరితో వచ్చినా తమ పార్టీపై ఎలాంటి ప్రభావం ఉండదని రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి జరిగిందని భావిస్తేనే ఓట్లు వేయాలని, లేదంటే వద్దు అని వైఎస్ జగన్ ఓటర్లకు సూచించారని ప్రశంసించారు. మరోసారి గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తుందని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.
ALso Read: చంద్రబాబుకు ఓట్లు కావాలి.. పవన్‌కు నోట్లు కావాలి , మళ్లీ జగనే సీఎం : ఎంపీ మార్గాని భరత్
అంతకుముందు పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఆయనకు దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులతో ఇంగ్లీష్‌లో మాట్లాడి చూపించాలని సవాల్ విసిరారు. ఐక్యరాజ్యసమితి వేదికపై పేద విద్యార్ధులు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని.. కానీ పవన్ మాత్రం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్ మీడియంపై ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
అటు తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్‌లపైనా మంత్రి ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడితే 48 గంటల్లో విడిపిస్తానన్న లోకేష్.. తన తండ్రి నెలరోజుల నుంచి జైల్లో వుంటే బయటకు తీసుకురాలేకపోయారని ఆదిమూలపు సురేష్ సెటైర్లు వేశారు. పాపం పండటం వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారని.. లోకేష్, పవన్ కళ్యాణ్‌లకే ఎలాంటి గ్యారెంటీ లేదని, అలాంటప్పుడు వారు ప్రజలకు ఏం చేస్తారని మంత్రి ప్రశ్నించారు.