మంత్రి జోగి రమేష్ అనుచరులం... మమ్మల్నే పర్మిషన్ లేదంటూ అడ్డుకుంటావా అంటూ విజయవాడలోని పున్నమి హోటల్లో టూరిజం అధికారులపై కొందరు చేయిచేసుకున్నారు. 

విజయవాడ: ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అనుచరలమంటూ కొందరు విజయవాడలో హల్ చల్ చేసారు. భవానిపురంలోని పున్నమి హోటల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు ఫోటో షూట్ చేస్తుండటంతో టూరిజం శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి జోగి రమేష్ అనుచరులం... మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ టూరిజం అధికారులపై చేయిచేసుకున్నారు. 

మంత్రి అనుచరులంటూ హెటల్లో హల్చల్ చేయడమే కాకుండా సిబ్బంది, అధికారులతో గొడవకు దిగి దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే టూరిజం అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పున్నమి హోటల్ కు చేరుకుని మంత్రి అనుచరులుగా పేర్కొంటున్నవారిని అదుపులోకి తీసుకున్నారు.

Video

ఈ ఘటనపై ఏసిపి హనుమంతరావు వివరణ ఇచ్చారు. తెల్లవారుజామును 5.30-6 గంటల సమయంలో పున్నమి రిసార్ట్స్ కు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ సుభాని ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం ఆరుగురితో కలిసి వచ్చినట్లు తెలిపారు. రిసెప్షనిస్ట్ లేకపోవడంతో ఎలాంటి అనుమతి లేకుండా ఫోటోలు తీయడం ప్రారంభించాడు. దీన్ని అడ్డుకున్న హోటల్ సిబ్బందితో పాటు మేనేజర్ శ్రీనివాస్ ను కూడా మరికొందరిని రప్పించి సుభాని కొట్టించాడని ఏసిపి తెలిపారు. 

సుభాని గ్యాంగ్ దాడిలో పున్నమి హోటల్ సిబ్బంది ఒకరు గాయపడటంతో అతడిని హాస్పిటల్ కు తరలించినట్లు ఏసిపి తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించనున్నట్లు ఏసిపి హన్మంతరావు తెలిపారు.