సారాంశం
తామే చెప్పులు వేసి, చిత్రవధ చేసి చంపిన వ్యక్తికి శతజయంతి పేరుతో వాళ్లే దండలు వేసి దండాలు పెడుతున్నారని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడుపై ఆయన విమర్శలు గుప్పించారు.
రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడుపై విమర్శలు గుప్పించారు మంత్రి జోగి రమేష్. శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను నిండు నూరేళ్లు జీవించి వుండేవాడిని అని ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. మళ్లీ ప్రాణం పోస్తే చంద్రబాబును సమాధి చేస్తానని ఎన్టీఆర్ దేవుడిని కోరుకుని వుంటారని జోగి రమేష్ పేర్కొన్నారు. తామే చెప్పులు వేసి, చిత్రవధ చేసి చంపిన వ్యక్తికి శతజయంతి పేరుతో వాళ్లే దండలు వేసి దండాలు పెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారంటూ జోగి రమేష్ ఆరోపించారు. తన పాలనలో పేదలకు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదని.. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఇదిలావుండగా.. తెలుగుదేశం పార్టీ జెండా తెలుగు జాతికి అండ అని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. గతంలో ఎప్పుడూ కనిపించని ఉత్సాహం ఈరోజు పార్టీ శ్రేణుల్లో చూస్తున్నానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని చెప్పారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు.
ALso Read: పార్టీ కార్యకర్తల త్యాగాలను మరిచిపోను.. రేపు టీడీపీ ఫేజ్-1 మేనిఫెస్టో: మహానాడు వేదికగా చంద్రబాబు
ఎన్టీఆర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని చెప్పారు. సైకిల్ గుర్తు సామాన్యుడి శ్రమకు గుర్తింపు అని.. సైకిల్‌కు ఎలక్ట్రికల్ హంగులు తీసుకొచ్చామని.. ఇకపై దూసుకుపోతామని తెలిపారు. సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని అన్నారు. తెలుగుదేశం శ్రేణులది ఉక్కు సంకల్పమని అన్నారు. గత నాలుగేళ్లుగా అధికార వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టీడీపీ శ్రేణులు ఎదుర్కొని నిలబడుతున్నారని తెలిపారు. ప్రాణాలు తీస్తామని బెదిరించినా కార్యకర్తలు వెనకడుగు వేయలేదని అన్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. పార్టీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు.
కార్యకర్తల త్యాగాలు మరిచిపోనని.. అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తనదని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తల రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు. రేపు అధికారం వచ్చినా.. ప్రతిపక్షంలో ఉన్నా తన పార్టీ కార్యకర్తల సంక్షేమం, అభివృద్ది కోసం పనిచేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల త్యాగాలకు సెల్యూట్ చేస్తానని చెప్పారు. శిరస్సు వంచి పాధాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనేనని అన్నారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను ప్రారంభించారని చెప్పారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని.. అలాగే సంపదను పేదవారికి పంచడం తెలసునని అన్నారు.