Asianet News TeluguAsianet News Telugu

పార్టీ కార్యకర్తల త్యాగాలను మరిచిపోను.. రేపు టీడీపీ ఫేజ్-1 మేనిఫెస్టో: మహానాడు వేదికగా చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జెండా తెలుగు జాతికి అండ అని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే పార్టీ శ్రేణులందరికీ ఎక్కడ లేని  ఉత్సాహం వస్తుందని చెప్పారు.

Chandrababu naidu speech at tdp mahanadu at rajamahendravaram ksm
Author
First Published May 27, 2023, 1:24 PM IST

తెలుగుదేశం పార్టీ జెండా తెలుగు జాతికి అండ అని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే పార్టీ శ్రేణులందరికీ ఎక్కడ లేని  ఉత్సాహం వస్తుందని చెప్పారు. రాజమహేంద్రవరంలో శని, ఆది వారాల్లో టీడీపీ మహానాడును  నిర్వహించనుంది. ఈరోజు ఉదయం మహానాడు ప్రారంభం అయింది. మహానాడు ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, ఇతర నాయకులు పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. గతంలో ఎప్పుడూ కనిపించని ఉత్సాహం ఈరోజు పార్టీ శ్రేణుల్లో చూస్తున్నానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా  నిర్వహించామని  చెప్పారు. క్రీస్తు శకం మాదిరిగా  ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని  చెప్పారు. సైకిల్ గుర్తు సామాన్యుడి  శ్రమకు గుర్తింపు అని.. సైకిల్‌కు ఎలక్ట్రికల్ హంగులు తీసుకొచ్చామని.. ఇకపై దూసుకుపోతామని తెలిపారు. సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని అన్నారు. 

తెలుగుదేశం శ్రేణులది ఉక్కు సంకల్పమని అన్నారు. గత నాలుగేళ్లుగా అధికార వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టీడీపీ శ్రేణులు ఎదుర్కొని నిలబడుతున్నారని తెలిపారు. ప్రాణాలు తీస్తామని  బెదిరించినా కార్యకర్తలు వెనకడుగు వేయలేదని అన్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. పార్టీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. కార్యకర్తల త్యాగాలు మరిచిపోనని.. అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తనదని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తల రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు. రేపు అధికారం వచ్చినా.. ప్రతిపక్షంలో ఉన్నా తన పార్టీ కార్యకర్తల సంక్షేమం, అభివృద్ది కోసం పనిచేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల త్యాగాలకు సెల్యూట్ చేస్తానని చెప్పారు. శిరస్సు వంచి పాధాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. 

సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది  టీడీపీనేనని అన్నారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను ప్రారంభించారని చెప్పారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని.. అలాగే సంపదను పేదవారికి పంచడం తెలసునని అన్నారు. 

2014లో విభజన జరిగినప్పుడు కష్టపడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ది చేస్తానని ఆలోచించానని చెప్పారు. దేశంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని టీడీపీ ప్రణాళిక రచించామని చెప్పారు. ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కానీ నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్.. విధ్వంసకర పాలనను సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజా వేదికతో ప్రారంభించి విధ్వంసాలకు పాల్పడుతూనే ఉన్నాడని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ అని.. పరిపాలనను రివర్స్‌ గేర్‌లోకి నెట్టాడని విమర్శించారు. అమరావతిని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో.. రాజధాని లేని  రాష్ట్రంగా ఏపీని తయారు చేశాడని విమర్శించారు. 

ఏపీలో సంపద దోపిడీ, ధరల బాదుడు ఎక్కువని చంద్రబాబు విమర్శించారు. స్కాముల్లో జగన్‌ మాస్టర్ మైండ్ అని ఆరోపించారు. ఆయన తెరిస్తే అన్నీ అబద్దాలేని, కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలేనని ఎద్దేవా చేశారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారని విమర్శించారు. రూ 2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అంతా సంకల్పం తీసుకోవాలని అన్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి రేపు టీడీపీ ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టోను ప్రకటిస్తామని  చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సైకిల్ సిద్దంగానే ఉందని అన్నారు. రానున్న ఎన్నికలు కురక్షేత్ర సంగ్రామం అని.. ఆ యుద్దంలో వైసీపీ కౌరవులను ఓడించి గౌరవ సభను ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులు ఆస్పత్రిలో ఉంటే నేరుగా పర్యవేక్షించడమే కాకుండా.. అవసరమైన వారికి తగిన సాయం అందించే వ్యవస్థకు భవిష్యత్తులో శ్రీకారం చూడతామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios